బోరుబావి..20గంటలు..రెండేళ్ల చిన్నారి..

ఉత్తర్ ప్రదేశ్ : ”20గంటలు..బోరుబావిలో రెండేళ్ల చిన్నారి..ప్రాణాలతో బయటకు వస్తాడా ? రాడా ? అనే అందరిలో ఉత్కంఠ..సహాయక చర్యలు చేపడుతున్న అధికార గణంలో ఒకటే టెన్షన్..టెన్షన్…ఎట్టకేలకు 20 గంటల తరువాత బాలుడు బయటపడ్డాడు..ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు..స్థానికులు హర్షాతిరేకాలు”..
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ సాయిపురిలో చోటు చేసుకుంది. ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. సుమారు 120 ఫీట్ల లోతులో ఉన్న బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్వారు. అంతవరకు పిల్లాడికి ఆక్సిజన్ అందించేందుకు సిలిండర్ లు ఏర్పాటు చేశారు. బాలుడున్న ప్రదేశానికి చేరుకోవడానికి అధికారులకు సుమారు 20గంటల సమయం పట్టింది. శనివారం ఉదయం 6గంటల ప్రాంతంలో బావిలో ఇరుక్కున్న చిన్నారిని బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకున్న సిబ్బంది అక్కడనే అంబులెన్స్ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా తాము ఆక్సిజన్ అందించినట్లు, తెల్లవారుజామున ఆరు గంటలకు బాలుడిని బయటకు తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడిని బయటకు తీయడానికి సిబ్బంది చాలా శ్రమించారని తెలిపారు. బాలుడు ప్రాణాలతో బయటపడడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.