బోరు బావిలో చిన్నారి

2

నల్లగొండ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): బోరు వేసిన వెంటనే మూసేయండి..దానిని తెరిచి ఉంచకండి..చిన్నారులు మృత్యువాత పడుతున్నారు..జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృత్యువాత పడిన సంగతి మరవక ముందే, తాజాగా నల్గొండ జిల్లా శాలిగౌరారం  మండలం వల్లాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వెల్లాలలో ఉంటున్న ఓ కుటుంబం బావులు తవ్వుకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం దంపతులు బావిని తవ్వుతుండగా చిన్నారి శాన్వీ  సవిూపంలో ఉన్న నిమ్మతోటలో ఆడుకొంటోంది. అక్కడనే ఉన్న బోరు బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు బావిలోకి తాడులు వదిలి చిన్నారిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారి శాన్వీ 25 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ఆకాక్షింస్తున్నారు. ఈ మేరకు అక్కడికి ప్రోక్లెయిన్‌ పంపి తవ్వితీసే ప్రయత్నం చేపట్టారు.