బ్యాంకులకు వరుస సెలవులు

banks-to-remain-open-this-sat-sun-to-exchange-junked-rs-500-1000-notesఏటీఎంలు మూగబోయాయి. ప్రజల నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో రాష్ట్రంలో నగదు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రిజర్వుబ్యాంకు నుంచి డబ్బులు వస్తున్నప్పటికీ వచ్చిన నగదు వస్తున్నట్లే ఖాళీ అవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెలవుల కారణంగా బ్యాంకులు మూతపడ్డాయి. ప్రజలు నగదు కోసం కేవలం ఏటీఎంలపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగదు లేకపోవడంతో ఉన్న ఒకటి రెండు ఏటీఎంల వద్ద ప్రజలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరుతున్నారు. మొత్తం ఏటీఎంలలో శనివారం దాదాపు 70 శాతం నగదు లేక ఒట్టిపోయి కనిపించాయి. ఎక్కడైనా నగదు వస్తున్నా అది రూ.2వేల నోట్లు మాత్రమే. చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో జేబులో డబ్బులున్నా లేని చందాన తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కిరాణ సరకులు, కూరగాయలు కొనడానికి కూడా ప్రజలు చిల్లర లేక ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.