బ్యాంకుల్లో దర్జాగా దళారుల దందా
డోర్నకల్ అక్టోబర్ 13 జనం సాక్షి
రైతులు క్రాప్‌లోన్ రెన్యువల్ కోసం దళారుల చేతిలో పడి రెక్కల కష్టాన్ని వారికి కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు.గత ఏడాది పంటలు చేతికి అందకపోవడంతో బ్యాంకు రుణాల నవీకరణ రైతులకు భారంగా మారింది.అప్పటికప్పుడు చేతిలో డబ్బులు లేని రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.దీన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు బ్యాంకుల్లో అన్ని తాము చూసుకుంటామని కర్షకులను మభ్యపెడుతున్నారు.బ్యాంక్ అధికారులను నేరుగా కలవకుండా జాగ్రత్తగా పడుతున్నారు.లక్షకు 5 వేల వరకు చెల్లించాలని షరతు విధిస్తున్నారు.వెంటనే రైతుతో కలిసి బ్యాంకుకు వెళ్లి పూర్తి రుణం చెల్లించి కొత్త రుణం పొందే విధంగా అన్ని పనులు చక్కబెడతారు.ఒప్పందం ప్రకారం రైతు నుంచి కమిషన్ తీసుకుంటారని ఓ రైతు ఆవేదన వ్యక్తంచేశారు.నిత్యం బ్యాంక్ సిబ్బంది కంటే ముందుగానే బ్యాంకు వద్దకు చేరుకొని అమాయక రైతులే టార్గెట్గా విధులు నిర్వహిస్తుంటారు.అక్రమ దారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా దందాను కొనసాగిస్తున్నట్లు పలువురు వెల్లడించారు.
ఏదేమైనా రైతుల నోట్లో మట్టి కొట్టే దందాలపై ఇకనైనా అధికారులు,ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.బ్యాంక్ సిబ్బంది మాట్లాడుతూ…బ్యాంకు పరిధిలోనికి రావద్దని చెపిన పెడచెవిన పెడుతున్నట్లు తెలిపారు.బ్యాంకు కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలున్నట్లు సిబ్బంది తెలపడం గమనార్హం.
యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ…బ్యాంకుకు రైతులు,కష్టమర్లు నేరుగా వచ్చి తమ బ్యాంకు కార్యకలాపాలు జరిపించుకోవాలని సూచించారు.అందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.
అన్నదాతల ఇక్కట్ల దృష్ట్యా
పూర్తి రుణాలు చెల్లించకుండా వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు తెలిపారు.క్రాఫ్ లోన్లకు సరైన ధ్రువపుత్రాలతో రైతులు నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలని కోరారు.దళారులను ఆశ్రయిస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు బ్యాంకు పనులు జాప్యం జరుగుతాయని అన్నారు.
బ్యాంక్ పరిధిలో నిత్యం తిరుగుతున్న (దళారీ) వ్యక్తులను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిపారు.రైతులు,కస్టమర్లు తనను నేరుగా కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.దళారి (మధ్యవర్తి) వ్యవస్థ నివారణ కృషి చేస్తున్నట్లు జనం సాక్షి ప్రతినిధికి తెలిపారు.