బ్యాంకు ఉద్యోగులపై ఆర్బీఐ ఆగ్రహం

Cyprus banksబ్యాంకు ఉద్యోగులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత నోట్లను డిపాజిట్‌ చేసే సందర్భాల్లో బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అలాంటి చర్యలు నిలువరించాలని కరెన్సీ మేనేజ్‌ మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పీ విజయ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని బ్యాంకుల్లో కొంతమంది బ్యాంకు అధికారులు కొంతమంది అపరాధులతో చేయి కలిపి డబ్బు మార్పిడి చేసే విషయంలో, డిపాజిట్‌ చేసే సమయాల్లో అవినీతికి పాల్పడుతున్నారని తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే బ్యాంకు అధికారులు అలాంటి పనులు ఆపివేయాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నగదు మార్పిడి, డిపాజిట్లలో బ్యాంకులకు జారీచేసిన సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే బ్యాంకులు సరియైన రికార్డులను నిర్వహించాలని  ఆదేశించారు.