బ్రాండ్‌ హైదరాబాద్‌ను..  బ్రాండీ హైదరాబాద్‌గా మార్చారు


– కేసీఆర్‌ నినాదం బార్‌ బడావో.. బార్‌ బచావో
– మద్యంతో నేరాలు ఎక్కువైనా పట్టించుకోవటంలేదు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
– మద్య నియంత్రణకై డి.కె. అరుణ దీక్ష
హైదరాబాద్‌, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో మద్యాన్ని ప్రభుత్వం ఏరులైపారిస్తుందని, మద్యంతో నేరాలు ఎక్కువైనా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలని గురువారం హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద మాజీ మంత్రి, బీజేపీ నేత డి.కె. అరుణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో లక్ష్మణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లిక్కర్‌ ఏరులైపారుతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలునేరాలకు మద్యమే ముఖ్యకారమని అన్నారు. బ్రాండ్‌ హైదరాబాద్‌ ను బ్రాండీ హైదరాబాద్‌ గా మార్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. ట్విటర్‌ లో పిట్ట కేటీఆర్‌ మాత్రం గొప్పలకు పోతాడని చెప్పారు. రాష్టాన్న్రి అప్పులపాలు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆదాయంకోసం మద్యంను ఏరులైపారిస్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ కు చెందుతుందని అన్నారు. మద్యనియంత్రణ శాఖను.. మద్యాన్ని పెంచే శాఖగా మార్చారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం 80వేల కోట్ల రూపాయల రాబడి ఉంటే.. 20వేల కోట్లు మద్యం అమ్మకంద్వారా రాబడుతోందని ఆయన చెప్పారు. మనది గాని పబ్‌ కల్చర్‌ ను ప్రజలనెత్తిన రుద్దుతున్నారని అన్నారు. మద్యం ద్వారా ఎన్నినేరాలు జరిగినా ప్రజలకు చీమకుట్టకుండా లేదని చెప్పారు. బీజేపీ బేటీ బచావో.. బేటీ పడావో అంటే.. కేసీఆర్‌ మాత్రం బార్‌ బచావో బార్‌ బడావో అని అంటున్నరని లక్ష్మణ్‌ విమర్శించారు.