బ్రిక్స్‌ సదస్సు తీర్మానంతో పాక్‌లో తత్తరపాటు

 

తమ దేశంలో ఉగ్రసంస్థలు ఉన్నాయని అంగీకారం

అయినా వాటిని కట్టడి చేస్తున్నామని ప్రకటన

ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మిత్రదేశం చైనాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ప్రపంచ దేశాలు పాక్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం, ఉగ్రమూలాలున్న సంస్థలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ఒకింత తత్తరపడింది. ఇదే దశలో ఇక లాభం లేదనుకుని తమ దేశంలో ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది. ఉగ్రదేశంగా ముద్ర పడి ప్రపంచ దేశాల ముందు అవమానాలకు గురైనా పాక్‌ నిజాలు అంగీకరించక తప్పలేదు. మొన్నటికి మొన్న తన మిత్రుడు చైనా కూడా సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్‌ కూడా పాక్‌ను ఉగ్రదేశంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తొలిసారి తమ దగ్గర నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ అక్కడి జియో న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అవును అందులో ఆశ్చర్యం ఏముంది? మన దగ్గర నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి అని ఆయన చాలా క్యాజువల్‌గా చెప్పారు. గత మూడేళ్ల నుంచి ఆ సంస్థ ఆట కట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆసిఫ్‌ వెల్లడించారు. అంతేకాదు బ్రిక్స్‌ ఆందోళనలు చైనావి కావని కూడా ఆయన చెప్పడం విశేషం. అయితే ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థలపై ఏవైనా చర్యలు తీసుకుంటేనే అంతర్జాతీయ సమాజంలో మనకు ఏమైనా పరువు ఉంటుంది అని ఈ ఇంటర్వ్యూలో ఆసిఫ్‌ అన్నారు. ప్రపంచమంతా మననే నిందిస్తున్నది. మన ఇల్లు చక్కదిద్దుకోవాల్సిందే అని ఆయన స్పష్టంచేశారు. ఇలాంటి సంస్థలను పట్టించుకోనంత వరకు అంతర్జాతీయ సమాజం నుంచి మనకు అవమానాలు తప్పవు అని కూడా ఆసిఫ్‌ చెప్పడం గమనార్హం. గత 40 ఏళ్లుగా పాక్‌ తప్పుల విూద తప్పులు చేస్తూనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. ఉగ్రవాదంతో పాకిస్థాన్‌కు ఎలాంటి

సంబంధం లేదని ప్రపంచానికి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆసిఫ్‌ అన్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారుతోందని అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పాక్‌ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఒప్పుకున్నారు. అయితే వాటిపై తమ దేశం కూడా చర్యలు తీసుకుంటోందని ఆసిఫ్‌ తెలిపారు. ఇందులో పెద్దగా ఆశ్చర్య పడాల్సింది ఏముంది? మేం కూడా ఆ ఉగ్రవాద సంస్థలను నిషేధించాం. గత మూడేళ్లుగా మా దేశం వాటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది. ఈ విషయంలో యావత్‌ ప్రపంచం మమ్మల్ని వేలెత్తి చూపుతోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలను నియంత్రించేంత వరకూ అంతర్జాతీయ దేశాల నుంచి మేం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉండాలి. కానీ మేం ఆ ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాం. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాం. ఆయా సంస్థలపై ఆంక్షలు విధించాం. పాక్‌ భూభాగాలు ఉగ్రవాదానికి ఉపయోగపడుతున్నాయని వస్తున్న వార్తలను మాత్రం మేం ఖండిస్తున్నాం. ప్రపంచానికి మేం చెప్పేది ఒక్కటే.. ఉగ్రవాదంతో పాక్‌ ఏం చేయట్లేదు’ అని ఆసిఫ్‌ తెలిపారు. బ్రిక్స్‌ సదస్సు ముగిసిన రెండు రోజులకే ఆసిఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేగాక.. బ్రిక్స్‌ తీర్మానంపై కూడా ఆసిఫ్‌ మాట్లాడారు. ‘బ్రిక్స్‌ నిర్ణయం తీసుకుంది అంటే అది కేవలం చైనా అధికారిక నిర్ణయం కాదు. అందులో రష్యా, ఇండియా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి’ అని తెలిపారు. గత కొంతకాలంగా చైనా పాక్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ సదస్సులో పాక్‌లోని ఉగ్రవాద సంస్థలపై తీర్మానం తీసుకురావడం, అందుకు చైనా కూడా అంగీకరించడంతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.