బ్రిటన్ కొత్త వైరస్ 60 దేశాలకు పాకింది
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
జెనీవా: బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటి వరకు 60 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. రూపుమార్చుకున్న కరోనా వైరస్ గత వారం రోజుల్లోనే 10 దేశాల్లోకి విస్తరించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20 లక్షలు దాటిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొత్త రకం వైరస్ వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అందరికీ అందించేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ మహమ్మారి వ్యాప్తిని నిలువరించడం సవాల్‌గా మారింది. భారత్‌లో మంగళవారం నాటికి 141 మందికి కొత్తరకం వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇక బ్రిటన్ తరహాలోనే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మరో రకం వైరస్.. ఇప్పటి వరకు 23 దేశాలకు పాకినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇక గతవారం రోజుల్లో మహమ్మారి మూలంగా 93వేల మంది మరణించారు. ఇదే సమయంలో కొత్తగా 47 లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి.మరోవైపు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు చివరి నాటికి 70శాతం మంది జనాభాకు టీకా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐరోపా సమాఖ్య వెల్లడించింది. అమెరికాలో ఇప్పటి వరకు 1.57 కోట్ల మందికి టీకా అందించినట్లు అక్కడి వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ(సీడీసీ) వెల్లడించింది. మరోవైపు కొత్త వ్యాప్తి నేపథ్యంలో కొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్ బాటపట్టాయి. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించారు. జర్మనీలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇక భారత్‌లో శనివారం టీకా పంపిణీ ప్రారంభం కాగా.. మంగళవారం నాటికి 4,54,049 మందికి వ్యాక్సిన్ అందజేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9,62,15,324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20,58,551 మంది మరణించారు. 2,42,54,144 కేసులతో అమెరికా తొలిస్థానంలో ఉండగా.. 1,05,95,639 కేసులతో ఇండియా, 85,73,864 కేసులతో బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.