బ్రిటన్‌ ప్రధానికి మరో ఎదురుదెబ్బ..

Amber Rudd leaves her home in London, Britain September 8, 2019. REUTERS/Peter Nicholls

– మంత్రి రాజీనామా చేసిన అంబర్‌ రూడ్‌
బ్రిటన్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్‌పై ఈయూతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న బోరిస్‌ కు సీనియర్‌ మంత్రి ఆంబర్‌ రూడ్‌ షాక్‌ ఇచ్చింది. నో డీల్‌ బ్రెగ్జిట్‌ కోసం ఆయన పట్టుబట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆంబర్‌ రూడ్‌ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. తాను బోరిస్‌ మంత్రివర్గంలో పూర్తి విశ్వాసంతో చేరానని, అక్టోబర్‌ 31లోపు మరో మెరుగైన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం వుంటుందని తాను భావించాను, కానీ, ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రెగ్జిట్‌ను పూర్తి చేయాలన్నది ఆయన ఉద్దేశమని ఇప్పుడు అర్థమైందని ఆమె విమర్శించారు. బ్రెగ్జిట్‌ విషయంలో జాన్సన్‌ సర్కారును వ్యతిరేకిస్తున్నారన్న సాకుతో విధేయులనే నేతలను బహిష్కరిస్తున్న సమయంలో తాను నిర్లిప్తంగా వుండలేనని రూడ్‌ తన ప్రకటనలో తెలిపారు. తన నిర్ణయం కొంత క్లిష్టమైదనేనన్న ఆమె… పార్లమెంట్‌ లో బ్రెగ్జిట్‌ తీర్మానంపై వ్యతిరేక ఓటు వేసిన వారిని బహిష్కరించటం ఆత్మగౌరవంపైన, ప్రజాస్వామ్యం పైన దాడి చేయటమే అవుతుందని అభివర్ణించారు. బ్రెగ్జిట్‌ విషయంలో బోరిస్‌ వైఖరిని వ్యతిరేకిస్తూ గతవారం అధికార పార్టీ ఎంపీ డాక్టర్‌ ఫిలిఫ్‌ లీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు  బోరిస్‌ జాన్సన్‌ కు రాసిన లేఖలో ఫిలిఫ్‌ లీ తెలిపారు. ఇప్పటికే అసంతృప్తులతో తల పట్టుకుంటున్న బోరిస్‌ కు ఇప్పుడు మంత్రి రాజీనామా కొత్త తలనొప్పిగా మారింది. బ్రెగ్జిట్‌పై తాను ప్రతిపాదిస్తున్న తీర్మానానికి పార్లమెంట్‌ ఆమోదం లభించకపోతే అక్టోబర్‌ 15న ముందస్తు ఎన్నికలకు అనుమతించాలంటూ ప్రధాని జాన్సన్‌ చేసిన ప్రతిపాదనను పార్లమెంట్‌ సభ్యులు తిరస్కరించిన విషయం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ఐరోపా కూటమితో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అక్టోబర్‌ 31 నాటికి బ్రెగ్జిట్‌ పక్రియను పూర్తి చేసి తీరుతామని బోరిస్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.