బ్రిటన్ లో రోడ్డు ప్రమాదం: 8మంది భారతీయులు మృతి


లండన్‌: బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో టెక్‌ సంస్థ విప్రో ఐటీ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.   శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం  12 మందిభారతీయులు ప్రమాణిస్తుండగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.  తమిళనాడుకు చెందిన అయిదుగురు,   కేరళచెందిన ఇద్దరితోపాటు   వీరి ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌  కూడా స్పాట్‌లో ప్రాణాలు విడిచారు.  గత 24 ఏళ్లలో ఇదే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదమని అధికారులు తెలిపారు.

విప్రో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో  టూర్‌ వెళ్తున్న మినీబస్ అదుపు తప్పి రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్నారు. పరిస్థితి  విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులంతా  కేరళ, తమిళనాడు చెందిన వారు.

ముఖ్యంగా చనిపోయినవారిలో  విప్రో ఉద్యోగి కార్తికేయన్ రామసుబ్రమణియం పుగూలు, అతని భార్య, విప్రో ఉద్యోగులు రిషి రాజీవ్ కుమార్, వివేక్ భాస్కర్ ఉన్నారు. విప్రోకే చెందిన  మనో రంజన్ పన్నీర్‌ సెల్వమ్, ఆయన భార్య సంగీత,  ఐదు సంవత్సరాల కుమార్తె  తీవ్రంగా  గాయపడ్డారు. అయితే వారి మామయ్య, తల్లిదండ్రులు చనిపోయారు. ఇది తీవ్ర విషాదమని విప్రో లిమిటెడ్ యూకే-యూరోప్‌  ఆపరేషన్స్‌ హెడ్‌ రమేష్ ఫిలిప్స్ తెలిపారు.  బాధితులకు తగిన సహాయాన్ని అందిస్తున్నామని, వారికి తమ మద్దతు కొనసాగుతుందని  చెప్పారు.మరోవైపు ప్రమాదంలో  మరణించిన మినీ ట్రక్‌  డ్రైవర్  సిరియాక్‌ జోసెఫ్‌ (52) కూడా  కేరళకు చెందినవారే.

కాగా  ఇద్దరు లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు  నమోదు చేసిన  పోలీసులు  వీరిని నేడు (సోమవారం) కోర్టులో హాజరు పరచనున్నారు. నవంబరు, 1993 తర్వాత బ్రిటిష్ మోటార్ వేపై జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో 12 మంది చిన్నారులు, వారి టీచర్ ప్రాణాలు కోల్పోయారని అధికారుల సమాచారం.