బ్రిటిష్ వారిని ఎదరించిన వీరపుత్రుడు ఖుదీరామ్ బోస్
నేడు ఆయన జయంతి సందర్భంగా …
న్యూఢిల్లీ,డిసెంబర3 (జనంసాక్షి) : స్వాతంత్ర సమర యోధుడు, అతి పిన్న వయసులోనే తెల్లవాళ్ళపై తిరగబడ్డ విప్లవవీరుడు, తల్లి భారతి ముద్ధుబిడ్డ ఖుదీరామ్ బోస్. ఎందరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాద్యనీయుడైన సుప్రసిద్ద స్వాతంత్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి డిసెంబర్ 3. 1889లో అతను నాటి బెంగాల్లో జన్మించాడు. ఆగస్ట్11న 1908లో అతడిని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం, నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ నా భరతమాతే అని గర్వంగా చెప్పిన ధీరుడాయన. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం ఒక అదృష్టంగా భావిస్తాను.. నా కోరిక ఒక్కటే … మన దేశానికి స్వాతంత్యం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి, నా జీవితాన్ని త్యాగం చేయాలని ప్రకటించారు. విప్లవవీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు.. బ్రిటీష్ వారిచ్చే బహుమతికి కక్కుర్తిపడి సాటి భారతీయుడే అతనని పట్టిచ్చాడు. ఉరిశిక్ష విధించిన జడ్జీ నీ చివరికోరిక ఏంటని ప్రశ్నించినపుడు ఖుదీరామ్ బోస్ చెప్పిన సమాధానం గమనిస్తే…విూరు గనుక అనుమతిస్తే ఇక్కడున్న నా భారతీయ సోదరులకు కూడా బాంబుల తయారీ గురించీ, దాని మెళుకువల గురించీ
చెప్పాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాడు. కోర్టు దానికి అనుమతించకపోవడంతో తన స్పూర్తిని ప్రజల్లో నింపుతూ వందేమాతర నినాదం చేస్తూ, భరతమాతకు జై కొడుతూ భగవద్గీత చేత్తో పట్టుకుని ఉరికంబానికి వేలాడి తన దేశభక్తిని చాటుకున్న గొప్ప దేశభక్తుడు ఖుదీరామ్ బోస్. !వందేమాతర గీతం సారాన్ని నిరక్షరాస్యులైన ప్రజలకు అర్ధమయ్యేలా, విద్యావంతులకు స్పూర్తినిచ్చేలా కరపత్రాలను తయారు చేసి స్వయంగా పంచుతూ అడ్డగించిన బ్రిటీష్ సైనికులపై ప్రతిదాడి చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన భారత బెబ్బులి ఖుదీరామ్ బోస్. ఇలాంటి దేశభక్తుల చరిత్రలు తెలియని వారికి ముఖ్యంగా పిల్లలకూ తెలియచేసాల్సి ఉంది.