బ్రిటిష్ పార్లమెంట్ వద్ద ఉగ్రదాడి

London-attacksలండన్‌: బ్రిటిష్‌ పార్లమెంటు సముదాయం సమీపంలో బుధవారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో ఒక మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన ప్రవేశద్వారం నుంచి పార్లమెంటులో ప్రవేశించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నిస్తూ, అక్కడి పోలీసు అధికారిపై కత్తితో దాడి చేసి, హతమార్చాడు. మరో అధికారిపైనా దాడి చేయబోతుండగా పోలీసులు కాల్పులు జరిపి ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇది ఉగ్రవాద ఘటనగానే భావిస్తున్నట్లు స్కాట్లాండ్‌యార్డ్‌ పోలీసులు తెలిపారు. అప్పుడే పార్లమెంటులో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వస్తున్న బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మేను కారులో సురక్షితంగా తరలించారు. తక్షణం అత్యవసర సేవల హెలికాప్టర్‌ను కూడా రంగంలో దింపారు. ప్రధాని సురక్షితంగానే ఉన్నారని ఆమె కార్యాలయం ప్రకటించింది. ఇదే సముదాయానికి చేరువగా మరో ఘటన చోటు చేసుకొంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు పలువురు పాదచారుల్ని పొట్టనపెట్టుకొంది. కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉంటారనీ, అనేక మంది గాయాలపాలయ్యారనీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కారు ఆ తర్వాత బ్రిటిష్‌ దిగువసభ భవంతిని పక్కనుంచి ఢీకొంది. రెండు దాడుల్నీ ఒకరే చేశారా, వీటిలో మొత్తంమీద ఎంతమంది పాల్గొన్నారనేది తెలియరాలేదు. ఈ ఘటనల దరిమిలా పార్లమెంటు సమావేశం అర్థంతరంగా ముగిసిపోయింది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎంపీలంతా పార్లమెంటు భవనంలోనే కొంతసేపు బందీలు మాదిరిగా నిరీక్షించాల్సి వచ్చింది. వెస్ట్‌ మినిస్టర్‌ భూగర్భ స్టేషన్‌ను మూసివేశారు. పార్లమెంటు భవనం ఉన్న ప్రాంతాన్ని దిగ్బంధం చేసినప్పుడు పలువురు పాఠశాలల పిల్లలూ, పర్యాటకులూ చిక్కుకుపోయారు. బ్రసెల్స్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు దాడి చేసి 32 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన జరిగిన సరిగ్గా సంవత్సర కాలానికి ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.

లండన్‌ పరిస్థితులపై ట్రంప్‌నకు నివేదన 
వాషింగ్టన్‌: లండన్‌ పార్లమెంటు వెలుపల జరిగిన ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అధికారులు నివేదించారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. లండన్‌లోని అమెరికా పౌరులు, పర్యాటకులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

ఖండించిన భారత్‌
దిల్లీ: యూకే పార్లమెంటు సమీపంలో జరిగిన ఉగ్రదాడిని భారత్‌ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దాడి ఘటనలో భారతీయులెవరూ గాయపడలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ బుధవారం రాత్రి ప్రకటించారు.