బ్లాక్మనీ నిరోధాదానికి సంస్కరణలు రావాలి
కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పిన ప్రధాని మోదీ విఫలం చెందారని విపక్ష పార్టీలు తరచూ వ్యాఖ్యానిస్తుంటాయి. ఇందులో గత పదేళ్లుగా అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ సహా, దానికి అంటకాగిన వామపక్షాలు ఉన్నాయి. నల్లధనం తీసుకుని రావడంలో ఇప్టపికే అనేక చర్యలు తీసుకున్నా అందుకు తగ్గట్లుగా ఫళితాలు లేవన్నది నిజం. అలాగే దేశంలో అంతకుమించి ఉన్న నల్లధనాన్ని ముందుగా వెలికి తీయాలి. అలాగే రుణ ఎగవేతదారుల భరత పట్టాలి. ఆ దిశగా ప్రయత్నాలు సాగాలి. ప్రభుత్వ రంగాన్ని నీరసపరుస్తూ ప్రైవేటు, కార్పొరేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల పేరుతో రైతులు, రైతు కూలీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మోదీ ప్రభుత్వం భూములు లాక్కునే చట్టం తీసుకువచ్చిందని దుయ్యబడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే దేశంలో రుణాల ఎగవేత కారణంగా అనేక బ్యాంకులు దివాళ స్థితికి చేరుకున్నాయి. ఎగవేత దారుల నుంచి బ్యాంకుల ముక్కుపిండి వసూలు చేయలేకపోతున్నారు. కేవలం వారి దృష్టంతా చిన్నిచిన్నగా అప్పులు తీసుకున్న వారిపైనే ఉంది. లక్షలోపు రుణం తీసుకుని కిస్తులు కట్టలేని వారిపై ఝళిపిస్తున్న కొరడా కోట్లు దిగమింగిన వారిపై పడడం లేదు. ఇదంతా మన చట్టాల్లో ఉన్న లొసుగులు, అధికారులు అనుసరిస్తున్న తీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. వీటిపై ఏకాభిప్రాయం తీసుకుని వచ్చేలా దేశంలోని రాజకయీ వ్యవస్థ పోరాడడం లేదు. బ్లాక్ మనీని నిరోధించేలా పన్నుల సరళీకరణ విధానాలపై సూచనలు చేయడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.500కోట్లు, అంతకన్నా ఎక్కువ మొత్తం ఎగవేసినవారి జాబితాను భారత రిజర్వుబ్యాంకు ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఎగవేత దారుల పేర్లను బహిర్గతం చేయాలని సుప్రీం ఆదేవఙంచినా ఎందుకనో రిజర్వ్ బ్యాంక్ ఆ పని చేయడం లేదు. ఆ పేర్లను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆర్బిఐ పేర్కొంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇతర బ్యాంకులతో విశ్వాసంతో కూడుకున్న సంబంధం ఉందని, ఆ వ్యవహారాలు వెల్లడిస్తే బ్యాంకులకు ఇబ్బందులు ఏర్పడతాయన్న ఆర్బీఐ వాదన సహేతుకంగా లేదు. ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా వెలిబుచ్చింది. ప్రజలకు సమాచారం వెల్లడించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించనందుకు భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)కు, ఇతర ఆర్థిక సంస్థలకు మొట్టికాయలు వేస్తూ సుప్రీం కోర్టు ఇటీవలే వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనదిగా చెప్పుకోవాలి. నిజానికి బ్యాకులు ఇస్తున్న డబ్బు ప్రజలది. వారి డబ్బును ఎవరికి ఏఊ అవసరాలుకు ఇస్తున్నారో, అందుకు ఎంతమంది సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. సమాచార హక్కు చట్టంకింద అవి జవాబుదారీ వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించే విషయంలో ఆర్బీఐ ఇప్పటివరకు వెనకాడుతూ వచ్చింది. అది ఇప్పుడిక ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన తనిఖీ, మదింపు నివేదికలు తదితర పత్రాలను, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ బయట పెట్టాల్సిందేనని తన తీర్పు ద్వారా సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. దేశ బ్యాంకింగు వ్యవస్థను నియంత్రిస్తున్న ఆర్బీఐ నిజానికి ముందుకు వచ్చి ఎగవేత దారుల వివరాలను బహిరంగ పరచాల్సి ఉంది. బ్యాంకుల వెబ్సైట్లలో బ్యాంకు డబ్బుల ఎగవేతదారుల వివరాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలకు గురైన బ్యాంకుల వివరాలు కూడా పొందు పర్చాలి.
ఆర్బీఐ అన్నది ఒక నియంత్రణ వ్యవస్థ అని, బ్యాంకులు జవాబుదారీ తనంతో వ్యవహరించేలా అది చూడాలని న్యాయస్థానం పేర్కొంది.భారత్ వంటి వర్ధమాన దేశంలో సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎంతో కీలకం. రుణాలను ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చి అవి వసూలు కావడం లేదని, ఎన్పిఎలు పెరగియాని చెబితే కుదరదు. ఏయేరంగాలకు రుణాలు ఇచ్చారో, వాటికి ప్రాతిపదిక ఏంటో తెలుసుకునే విధంగా పారదర్శకత ఉండాలి. సామాన్యలను వేదిస్తున్న బ్యాంకులు బడాబాబులను ఎందుకు వేధించడం లేదు. అందుకే మాల్యాలాంటి వారు దేశం విడిచి వెల్లిపోతున్నా చూసీ చూడనట్లుగా ఉన్నారు. వ్యవస్థ దారితప్పకుండా ఉండాలంటే ప్రభుత్వం జవాబుదారీతనంతో, పారదర్శకంగా వ్యవహరించక తప్పదు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు రావాలి. పారదర్వకంగా ప్రతి పైసా బ్యాంక్ ద్వారా లావాదేవీలు సాగాలి. అప్పుడే ప్రజలు డబ్బును దాచుకునే వ్యవస్థ పోతోంది. ప్రజల వద్ద ఉన్న ప్రతి పైసాకు లెక్కుండాలి. రహస్యం పేరుతో దాచిపెట్టడం ప్రజలకు ప్రయోజనదాయకం కాదని గుర్తుచేయాలి. ముందుకు పెద్ద బకాయిదారుల నుంచి వసూళ్లు చేయడం, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిగేలా చూసలేఆ పన్నుల వ్యస్థలో మార్పులు రావాలి. పన్నుల చెల్లింపులో సరళీకరణ విధానాలు రావాలి.
అధికారులు జవాబుదారీగా వ్యవహరిస్తేనే ప్రజలు అణచివేత నుంచి, అవినీతి నుంచి రక్షణ పొంద గలుగుతారు. వివిధ న్యాయస్థానాలు అనేక కేసుల్లో పేర్కొన్న విధంగా వివిధ స్థాయుల్లో ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించేలా చూసేందుకు నిరంతర ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. అప్పుడే దేశంలో ఉన్న నల్లధనాన్ని కనీసం బ్యాకులకు మళ్లించి బ్లాక్ మనీ వ్యవస్థ లేకుండా చేసుకోగలుగతాం. ప్రధానంగా పన్నుల సరళీకరణ విధానాలపై మార్పులు రానంత వరకు బ్లాక్ మనీ వ్యవహారాలుస్థిరంగా ఉంటాయి.