బతుకమ్మ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాన్ని సీఎస్ నిర్వహించారు. పండుగ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు.
ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 26న దాదాపు 35వేల మంది మహిళలతో పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పాటలతో, “బతుకమ్మ పండుగ ఉత్సవం” నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా సెప్టెంబర్ 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు బతుకమ్మలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ ఉత్సవం, నిమజ్జనం సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనం సందర్భంగా తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం వంటి పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందిoచాలని నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. రాష్ట్ర్త స్థాయిలో నిర్వహించే విధంగా జిల్లాలలో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అయన అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.