భక్తితోనే భగవంతుడి సాక్షాత్కారం
తిరుమల,మార్చి2(జనం సాక్షి): భగవంతుడు ఎల్లవేళలా తనయందు భక్తి ఉండాలని కోరుకుంటాడు. భక్తితో తనను శరుణు వేడుకున్న వారికి అండగా ఉంటానని చెబుతాడు. మన పురాణాలు, ఉపనిశత్తులు, అన్నీ ఇదే చెబుతున్నాయి. పురాణాలు, ఇతిహాసాల్లో ప్రహ్లాదాదులంతా ఇలాగే భక్తిని చాటారు. భగవంతుడు వారికి అండగా నిలిచాడు. అంటే భక్తికి భగవంతుడు వశమవుతాడన్నది సత్యం. ప్రతిఫలాపేక్ష లేకుండా తనను కొలువుమని గీతాచార్యుడు చెప్పాడు. ఆధునిక కాలంలోనూ ఇదే పద్ది కొనసాగుతోంది. గుడికి వెళ్లడం భక్తితో చేయాలని అంటారు. భగవంతుని విూద పరిపూర్ణమjైున ప్రేమ కలిగి ఉండడమే భక్తి. అది అమృతానంద స్వరూపం. త్యాగరూపమైనది అయి ఏ కోర్కెలూ లేని స్థితిలో ఉండాలి. అదే మోక్ష అని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి. భగవద్గీతలోని ’భక్తియోగం’ భక్తి తత్త్వాన్నీ, లక్షణాల్నీ విపులంగా తెలిపింది. శ్రీమద్భాగవతం భగవద్భక్తుల లక్షణాలను, భక్తి స్వరూపాన్నీ సవిస్తరంగా ఆవిష్కరించింది. మానవునికి క్రోధం, శోకం లాంటి ఎన్నెన్నో అనుభూతులు ఉన్నా ప్రేమ లాంటి మధురమైన అనుభూతి మరేదీ లేదు! ప్రేమ పొందడం కన్నా ప్రేమించడం ఇంకా మధురం. మానవునికి స్వతహాగా ప్రేమించే లక్షణం ఉన్నా… ఆ ప్రేమ ఒక వ్యక్తికో, ఒక వస్తువుకో మాత్రమే పరిమితమవుతుంది. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ, స్వార్థభావంతో కలుషితమౌతూ, విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. దీనినుంచి బయటపడి ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటే భగవంతుడు వశమవుతాడని పురాణాలు చెబుతున్నాయి. నిష్కామంగా ప్రేమించడాన్ని సాధన చెయ్యాలి. ఈ జగత్తులో భగవంతుడు సర్వవ్యాప్తి. సమష్టి రూపమైన భగవంతుని పట్ల… సాధకులు చేసే ’నిష్కామప్రేమ’ అనే ఈ ఉపాసనాక్రమానికి కూడా ’భక్తి’ అనేదే వ్యవహార నామం. భక్తి సార్వజనీనం, భేదరహితం కావడంవల్ల నిజమైన భక్తిలో లోపాలు ఉండవు. అనంతమైన భగవత్తత్త్వానికి అనంతమైన కళ్యాణ గుణాలు, రూపాలు, నామాలు ఉన్నాయి! వాటిలో రాముడు, కృష్ణుడు, శివుడు, లలిత తదితర సంపూర్ణ దేవతామూర్తుల్ని ఉపాసనా సౌలభ్యం కోసం వేద, పురాణాలు మనకు అందించాయి. భక్తులు తమకు ఇష్టమైన ఒక దేవతా మూర్తిని స్వీకరించి, సమస్త దేవతలనూ, సమస్త జగత్తునూ ఆ మూర్తిలోనే ఉన్నట్టు భావించి, పరదేవతగా ఉపాసించడం ద్వారా భక్తిని కలిగి ఉండాలి. మనసు మరే ఇతర విషయాల విూద, ఇతర దేవతా రూపాల విూద కాకుండా… ఆ ఇష్టదేవతామూర్తి పైనే నిరంతరం లగ్నం కావాలి. ఇందులో ఏ దేవుడు గొప్ప అన్నది లేదు. అంతా సమానమే. అంతేకాని విష్ణువు, శివుడు వేరని
మాత్రం కాదు. ఒకే భగవంతుడు అనేక విభూతులలో, అనేక కార్యాలు చేస్తూ, వేర్వేరు పేర్లతో, వేర్వేరు రూపాలతో, వేర్వేరు తత్త్వాలుగా కనిపిస్తాడు. మనం ఏ రూపంలో భక్తితో కొలిస్తే భగవంతుడు ఆ రూపంలో మనకు సాక్షాత్కరిస్తాడు. మానవుడు తాను కల్పించుకొనే మానవ సంబంధాలనే భగవంతునితో కల్పించు కొని… తద్వారా భగవంతునికి మరింత చేరువ కాగలడు. భగవంతునితో అవిచ్ఛిన్నమైన నిరంతర సాన్నిహిత్యం కలిగిన నాడు మానవుడు నిత్యానంద స్థితిని చేరుకుంటాడు. లౌకికమైన బంధాల్నే నిష్కామంగా భగవంతునితో కల్పించుకుంటే, ఆ సంబంధాలే ముక్తిహేతువులౌతాయి.