భగీరథకు భారీ సాయం

C

– రూ.6750 కోట్ల రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు

హైదరాబాద్‌,ఆగస్టు 17(జనంసాక్షి): తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్‌ భగీరథలో భాగస్వామ్యమయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డ 7 బ్యాంకులు దాదాపు రూ. 6,750 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి అంగీకరించాయి. ఇందులో ఆంధ్రాబ్యాంక్‌ రూ. 1300 కోట్లు, దేనా బ్యాంక్‌ రూ. 500 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ రూ. 700 కోట్లు, సిండికేట్‌ బ్యాంక్‌ రూ. 1000 కోట్లు, ఓబీసీ బ్యాంక్‌ రూ. 1000 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ. 1000 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ. 750 కోట్లు, అలహాబాద్‌ బ్యాంక్‌ రూ. 500 కోట్లు సహాయం చేయనున్నాయి. హైదరాబాద్‌ సైఫాబాద్‌ లోని ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.ఆంధ్రా బ్యాంకు ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ సురేష్‌ ఎన్‌. పటేల్‌ అధ్యక్షతన జరిగిన కన్సార్టియం విూటింగ్‌ లో పంచాయతీరాజ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్పీ సింగ్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీధర్‌, ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ రామ్మోహన్‌, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ అండ్‌ ఎస్‌ ఈ.ఎన్‌.సి సురేందర్‌ రెడ్డి తో పాటు అలహాబాద్‌, దేనా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌, సిండికేట్‌, ఓబీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.మిషన్‌ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తాము భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ పటేల్‌. తాము ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1300 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడానికి ఒప్పుకున్నామన్నారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ దైవకార్యంలో ఇతర బ్యాంకులను భాగం చేయాలన్న ఉద్దేశ్యంతోనే కన్సార్టియం ఆలోచన చేశామన్నారు. తమ బ్యాంకు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రాజెక్టు డిపీఆర్‌ లను పరిశీలించడంతో పాటు టెండర్ల ప్రక్రియ, బిల్లుల చెల్లింపు విధానాన్ని నిశితంగా పరిశీలించారని చెప్పారు. థర్ట్‌ పార్టీ కన్సల్టెంట్‌ గా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ ఈ ప్రాజెక్టు డిజైన్‌ లు, నాణ్యతను పరిశీలించడం మిషన్‌ భగీరథ అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తాము సంపూర్ణంగా సంతృప్తి చెందాకే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ విూటింగ్‌ లో ఆర్థిక సహాయానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక ప్రభుత్వ పథకానికి ఎలాంటి శషభిషలు లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని లోన్‌ గా ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు.మిషన్‌ భగీరథ లక్ష్యాలు, అవసరాన్ని పవర్‌ పాయింట్‌ రూపంలో ప్రదర్శించారు పంచాయతీరాజ్‌ స్పెషల్‌ సిఎస్‌ ఎస్పీసింగ్‌. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల విూదుగా ప్రారంభించిన మిషన్‌ భగీరథ మొత్తం దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలవబోతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రజలకు సురక్షిత మంచినీరు దొరక్కపోవడం బాధాకరమన్నారు. అందుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్‌ భగీరథను ప్రారంభించారని గుర్తుచేశారు.ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టాలంటే ఆర్థిక వనరులతో పాటు రాజకీయ సంకల్పం కావాలన్నారు ఎస్పీ సింగ్‌. ఆ రాజకీయ సంకల్పంతోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఆలోచించడానికి కూడా సాహసించని భారీ ప్రాజెక్టును సిఎం కేసీఆర్‌ చేపట్టారన్నారు. 20 ఏళ్ల క్రితం సిద్దిపేట ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించిన అనుభవంతో ముఖ్యమంత్రి మిషన్‌ భగీరథను డిజైన్‌ చేశారని చెప్పారు. మూడున్నర సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేసి గడప గడపకు నల్లాతో సురక్షిత నీటిని అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనని ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేశారని చెప్పారు.ఆ తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇవాళ దేశంలో గుజరాత్‌ తరువాత తెలంగాణనే మిగులు రాష్ట్రమన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో స్థిరమైన వృద్ధి నమోదు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే అన్నారు. 14 వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను తెలియచేస్తాయన్నారు. పన్ను వసూలులో మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆదాయంలో నెంబర్‌ వన్‌ గా ఉన్న తెలంగాణ రాష్ట్రంతో చేతులు కలిపి అభివృద్ధిలో భాగం కావాలని బ్యాంకర్లను కోరారు.మిషన్‌ భగీరథ రుణాలకు రాష్ట్రం గ్యారంటీగా ఉండడం బ్యాంకర్లకు భరోసా ఇస్తుందన్నారు ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌. సమాజానికి ఉపయోగపడే మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో భాగం అయ్యే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకొన్ని బ్యాంకులు కూడా కన్సార్టియంలో చేరడానికి ఆసక్తి చూపిస్తూ తమను సంప్రదిస్తున్నాయని, తరువాతి విడతలో వాటి గురించి ఆలోచిస్తామన్నారు.మిషన్‌ భగీరథకు రుణ సహాయం చేసే విషయంలో తమకు రెండో ఆలోచన లేదని వివిధ బ్యాంకుల ప్రతినిధులు చెప్పారు.1300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంపై ఆంధ్రాబ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ విూటింగ్‌ లో ఇప్పటికే అంగీకారం కుదిరింది. త్వరలోనే ఈ నిధులను విడుదల చేస్తారు. మిగిలిన బ్యాంకులు త్వరలో జరిగే తమ మేనేజ్‌ మెంట్‌ కమిటీ విూటింగ్‌ లో రుణ సహాయానికి ఆమోదం తెలుపనున్నాయి. మూడు సంవత్సరాల తరువాత అంటే 2019 నుంచి రీ పేమెంట్‌ పీరియడ్‌ మొదలువుతుంది. గరిష్టంగా 12 సంవత్సరాల్లో ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.ప్రభుత్వ రుణ సంస్థలైన నాబార్డ్‌, హడ్కో టర్మ్‌ అండ్‌ కండీషన్‌ పైనే తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్‌ ను మంజూరు చేయడం విశేషం. ఈ రుణ మొత్తాన్ని కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని-భూపాలపల్లి, ఎల్‌ఎండి కరీంనగర్‌, ఎల్‌ఎండి మానకొండూర్‌ తో పాటు వరంగల్‌ జిల్లాలోని గోదావరి- మంగపేట సెగ్మెంట్‌ లోని మిషన్‌ భగీరథ పనులకు ఉపయోగిస్తారు.మిషన్‌ భగీరథకు ఆర్థిక సహాయానికి బ్యాంకులు ముందుకురావడం తెలంగాణ ప్రభుత్వ విశ్వసనీయత, పారదర్శకతకు నిదర్శనమని ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ అండ్‌ ఎస్‌ ఈ.ఎన్‌.సి సురేందర్‌ రెడ్డి చెప్పారు.

ఎస్‌ఐ ఆత్మహత్యపై విచారణకు ఆదేశం

కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా నిజామాబాద్‌ అడిషనల్‌ ఎస్పీ ప్రతాప్‌రెడ్డిని నియమించింది. ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకొని నివేదిక సమర్పించాలని ఏఎస్పీ ప్రతాప్‌ రెడ్డికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఐ బుధవారం సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు పై అధికారుల వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు.