భత్కల్ సెల్‌ఫోన్ మాట్లాడలేదు
– జైలు నుంచి పారిపోతాడన్న ఎన్‌ఐఏ వాదనను ఖండించిన జైళ్ల శాఖ డీఐజీ
హైదరాబాద్,జులై4(జనంసాక్షి):
దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ అన్నారు. ఈమేరకు ఆయన విూడియాతో మాట్లాడుతూ జైలులో తన భార్య, తల్లితో భత్కల్ 27సార్లు మాట్లాడారని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం తాము ల్యాండ్ ఫోన్లో మాట్లాడేందుకు అనుమతించామని తెలిపారు. వారిద్దరితో భత్కల్ ఫోన్ సంభాషణ హిందీ, అరబిక్ భాషలో ఉందని స్పష్టం చేశారు. అయితే అక్రమంగా లేదా తమకు తెలియకుండా మాట్లాడిన సందర్భం లేదన్నారు. యాసిన్‌భత్కల్ జైలులో ఎలాంటి సెల్‌పఫోన్ వాడటం లేదని డీఐజీ నరసింహ స్పష్టం చేశారు. యాసిన్ భత్కల్ 2014 నవంబర్ నుంచి చర్లపల్లి జైలులో ఉన్నాడని చెప్పారు. జైలు నుంచి తప్పించుకునేందుకు భత్కల్ పన్నిన కుట్రను కేంద్ర నిఘావర్గాలు పసిగట్టిన నేపథ్యంలో డీఐజీ విూడియాతో మాట్లాడారు. జైలులోని అందరు ఖైదీలకు ల్యాండ్ లైన్ సౌకర్యం ఉందని.. భత్కల్‌కు మాత్రం ల్యాండ్ లైన్ ద్వారా మాట్లాడేందుకు కూడా అనుమతించలేదన్నారు.జైలు నుంచి బత్కల్ పారిపోతాడన్న ఎన్‌ఐఏ వాదనను ఆయన తోసి పుచ్చారు. మెట్రో పాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు కుటుంబసభ్యులతో వారంలో రెండుసార్లు ఫోన్ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. అతను తల్లి, భార్యతో అరబిక్, ఉర్దూ బాషల్లో ఫోన్‌లో సంభాషిస్తాడని… నిబంధనల మేరకు మాట్లాడిన ప్రతి కాల్‌ను రికార్డు చేశామని వెల్లడించారు. ఎన్‌ఐఏ అధికారులు తమ దగ్గర సమాచారం ఉందని చెప్పలేదని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో చర్లపల్లి జైలుకు అదనపు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.