భద్రతాసిబ్బంది కళ్లుగప్పి విమానమెక్కిన ఏడేళ్ల బాలిక
జెనీవా: స్విట్జర్లాండ్‌లో ఓ ఏడేళ్ల బాలిక.. టిక్కెట్, బోర్డింగ్‌పాస్ వంటివేవీ లేకుండానే ఏకంగా విమానం ఎక్కేసింది. తల్లిదండ్రుల వద్ద నుంచి పారిపోయి వచ్చిన ఆమె.. భద్రతా సిబ్బందిని తెలివిగా బోల్తా కొట్టించగలిగింది. జెనీవా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. చివరికి చిన్నారి అక్రమంగా విమానం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించిన విమాన సిబ్బంది.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. జెనీవా ప్రధాన రైల్వేస్టేషన్‌లో తల్లిదండ్రుల వద్దనుంచి పారిపోయి.. విమానాశ్రయానికి వెళ్లే రైలును చిన్నారి ఎక్కినట్లు అధికారులు గుర్తించారు. ఇటు విమానాశ్రయంలో పెద్దవారి వెనుకో, ముందో నడుస్తూ.. భద్రత సిబ్బందికి తాను ఒంటరినన్న విషయం తెలియనివ్వకుండా ఆమె విమానంలోకి ప్రవేశించినట్లు వారు తెలిపారు.