భవనం కూలిన ఘటనలో 34కుచేరిన మృతుల సంఖ్య

ముంబై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేసిన వర్షాలకు తోడు పురాతన భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 34కి చేరింది. సంఘటనా స్థలం దగ్గర ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంబై మహానగరం తడిసి ముద్దైంది. గురువారం వర్షాల తాకిడి నుంచి ముంబై ప్రజలకు కాస్త ఉపసమనం లభించింది. భేండీ బజార్‌లోని 117 సంవత్సారల క్రితం నాటి ఐదంతస్థుల హుస్సేనీ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పటికే మృతదేహాలను తొలగించి సహాయకచర్యలుముమ్మరం చేశారు. ఇంకా ఎవరైనా చిక్కకున్నారా అని గాలిస్తున్నారు. అయితే శుక్రవారంఉదయం మరో 10 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య 34కి చేరింది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలిస్తున్నారు. కెమెరాలను శిథిలాలోకి పంపి వెతుకుతున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదని పోలీసులు అన్నారు . సహాయక చర్యలు పూర్తయి, శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించిన తరవాత ఈ ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ పురాతన భవనంలో సుమారు 40 మంది నివసిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ భవంతి నివాసయోగ్యంగా లేదని, ఇందులో ఎవరూ ఉండకూడదని మహారాష్ట్ర గృహనిర్మాణాభివృద్ధి సంస్థ 2011లోనే ప్రకటించింది. కానీ అద్దెలు తక్కువగా ఉంటాయన్న కారణంతో పలు కుటుంబాలు ఆ ఇంటిలోనే ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంలో మరణంచిన వారి కుంటుబాలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.