భవిష్యత్‌లో ఎలక్ట్రికల్ కార్లదే హవా
– సౌరశక్తి అంశంలో భారత్ మరింత అభివృద్ధి సాధిస్తోంది
– అమరావతిని గార్డెన్ సిటీగా తయారు చేస్తున్నాం
– స్మార్ట్ అర్బన్ హ్యాబిట్ అంశంపై ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు
– రెండోరోజు సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడిపిన ఏపీ సీఎం
సింగపూర్, జులై9(జనం సాక్షి) : భవిష్యత్‌లో ఎలక్రికల్ కార్లదే హవా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సౌరశక్తి అంశంలో భారత్ మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఖర్చుతో కూడుకున్నదే అయినా సోలార్ విండ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు రెండో రోజు సోమవారం ఆ దేశ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్మార్ట్ అర్బన్ హ్యాబిటేట్ అంశంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. పరిమిత స్థలంలోనే గృహనిర్మాణాలు ఎలా చేపట్టాలో అనే విషయాన్ని సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత ‘పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అనే అంశంపై ప్రపంచ నగరాల సదస్సులో బాబు ప్రసంగించారు. నివాస యోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సాంకేతికత, మౌలిక సదుపాయల కల్పన అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాధనాల ద్వారా భూగర్భ, ఉపరితల నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత తదితర సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చవని సూచించారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పునర్ వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ తదితర చర్యలతో మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు. తాగునీటికే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కూడా తగినంత నీటిని ఇవ్వగలుగుతున్నామని సీఎం చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రధానంగా దృష్టి పెట్టామని వివరించారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తూ ఏపీ నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. కొత్త సిటీలో 35 లక్షల మంది నివసించే
ఆస్కారం ఉందన్నారు. అమరావతిలో నిర్మించనున్న సిటీలు, టౌన్ సిటీలు, రింగ్‌రోడ్డు గురించి సింగపూర్ ప్రతినిధులకు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్‌లు, సోషల్ యాక్సిస్, వర్క్ టు వర్క్ ప్రిన్సిపల్‌తో అమరావతిని గార్డెన్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాజధానిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు..సామాజిక అవసరాలకు 10… కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెప్ట్ అమలు చేస్తామని సమావేశంలో పేర్కొన్నారు. 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.