భాగ్యనగరంపై కన్నేసిన దొంగల ముఠాలు

హైదరాబాద్‌ : రాజధాని నగరంపై దొంగల ముఠాలు గురిపెట్టాయి.. కొంతకాలంగా అంతగా కనపడని చోరుల హడావుడి తాజాగా తారస్థాయికి చేరింది. ఓవైపు గస్తీ .. నిఘా పెంచామని పోలీసులు చెబుతున్నా.. దొంగలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అరెస్టులతో నియంత్రణ చర్యలు చేపడు తున్నా దొంగతనాల జోరు కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి ముందే ఇలా సవాల్‌ విసురుతుండటంతో రానున్న వారంలో ఇంకెన్ని ఇళ్లకు కన్నాలు పడతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. పండగ కోసం ఇక్కడి ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్న వారి సంతోషం ఎంతకాలం ఉంటుందోననే సందేహం వ్యక్తమవుతోంది. దిల్లీ నోయిడాకు చెందిన గొలుసు దొంగలు గత నెల చివరివారంలో ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో కేవలం 15 గంటల వ్యవధిలో 11 చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకొని పదుల సంఖ్యలో బృందాల్ని ఏర్పాటు చేసి గాలింపు విస్తృతం చేశారు. చాకచక్యంగా ముగ్గురు దొంగల్ని పట్టుకొన్నారు.బాధితులు పోగొట్టుకున్న సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకొని శభాష్‌ అనిపించుకున్నారు. ఈ సంబరం ఎంతో సేపు నిలవలేదు. పోలీసులు ఓవైపు ఈ ముఠా వేటలో ఉండగానే.. మరోవైపు చోరీల పరంపర కొనసాగింది. సంక్రాంతి పండగ నేపథ్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సెలవులకు ముందే పెద్దఎత్తున దుండగులు చోరీలకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తిస్థాయిలో జనాలు పండగకు స్వగ్రామాలకెళ్లి ఇళ్లకు తాళాలు పడితే ఇంకా ఎంత విజృంభిస్తారోననే భయం వెంటాడుతోంది. పోలీసులు మరిన్ని గస్తీబృందాల్ని రంగంలోకి దించారు. ఊర్లకెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అది సాధ్యమయ్యే పనికాదనేది సుస్పష్టం. ఈ క్రమంలో మూడు కమిషనరేట్ల పోలీసులు చేపడుతున్న నియంత్రణ చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.