భాజపా,బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం
` కాళేశ్వరంపై చర్యలెందుకు తీసుకోలేదు?
` ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
` సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంమని వెల్లడి
ఖమ్మం(జనంసాక్షి): కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు.భారాస, భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వివిధ అంశాలపై విూడియాతో మాట్లాడారు. ‘నియంతృత్వ పాలకుల విూదే తిరుగుబాటు ఉంటుంది. మాది ప్రజాస్వామ్య పాలన..మాపై తిరుగుబాటు ఉండదు. ఇప్పుడే ప్రజలు, అధికారులు స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుంది. ఎవరిపైనా ఒత్తిడిలేని పాలన కొనసాగిస్తాం’’అని భట్టి తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రపంచీకరణకు అనుగుణంగా వర్సిటీలో కోర్సులు పెడతామని వివరించారు.
సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం: భట్టి
తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడంతో పాటు వారికిచ్చిన హావిూలను నెరవేర్చడానికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడిరచారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు 30 రోజుల కాంగ్రెస్ పాలనపై ఆయన ట్వీట్ చేశారు.’’రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ వాటిని అధిగమించి.. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. విభజన హావిూల అమలు కోసం కేంద్రానికి విన్నవిస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా పాలన కొనసాగిస్తాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఇప్పుడు పాలన, అభివృద్ధే ముఖ్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం సమష్టి బాధ్యత. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసమే ఏర్పాటు చేశారని.. పౌరులు అనుకునే విధంగా మా పరిపాలన సాగుతుంది’’ అని తెలిపారు.