భాజపా బాద్‌’షా’..

4
మరోసారి బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా

న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): బీజేపీ జాతీయ అధ్యక్షునిగా అమిత్‌ షా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం ఢిల్లీలో సమావేశం అయిన జాతీయ కార్యవర్గం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఒకటి…రెండు ఎదురుదెబ్బలు తగిలినా బీజేపీలో అమిత్‌ షాకు తిరుగులేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. దీంతో మరోసారి బీజేపీ అధినేతగా ఆయన బాద్యతలు చేపట్టారు. కేంద్రమంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014లో బీజేపీ అధ్యక్షునిగా అమిత్‌ షా బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ మంచి విజయాలు నమోదు చేసింది. ఢిల్లీ, బిహార్‌ ఎన్నికల్లో మాత్రం పరాభవం తప్పలేదు. 50 ఏళ్ల వయసులోనే అమిత్‌ షా బీజేపీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీలో పనిచేసి బీజేపీకి అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే అమిత్‌ షాను బీజేపీ అధ్యక్షుడిని చేసింది. మోదీ, అమిత్‌ షా ఒకే రాష్ట్రానికి చెందినవారు. 1964లో జన్మించిన అమిత్‌ షా మోదీకి అత్యంత సన్నిహితుడు.ఆయన కింది స్థాయి నుంచి ఎదిగారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు ఎదిగారు. ప్రత్యర్థులకు చిక్కకుండా వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట.