భాజపా ముక్త్‌భారత్‌కు సిద్ధంకండి

` కేంద్రంలో వచ్చేది రైతు రాజ్యమే..
` ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేనేతలకు బుద్ధిచెప్పండి
` జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా
` అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే
` కార్పోరేట్‌ గద్దలకు దోచి పెడుతున్న మోడీ
` ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయని బిజెపి
` గుజరాత్‌ మోడల్‌ పేరుతో దేశాన్ని మోసం చేసిన మోడీ
` మోడీకి విూటర్‌ బింగించాల్సిన సమయం వచ్చింది
` చెప్పులు మోసే వెధవలుకూడా కారుకూతలు
` పరోక్షంగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు
` మేధావులు,కళాకారులు అప్రమత్తంగా ఉండాలి
` పెద్దపల్లి బహిరంగసభలో నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌
` జిల్లాలో సవిూకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
పెద్దపల్లి(జనంసాక్షి):బిజెపి ముక్త భారత్‌ కావాలంటూ సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. దేశాన్ని కార్పోరేట్‌ గద్దలకు దోచి పెడుతున్న బీజేపీ అవినీతి గద్దలను గద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి పలుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గత ఎనిమిదేళ్లుగా దేశానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేయకపోగా..దేశాన్ని దివాళా తీయిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై ప్రత్యక్ష దాడికి దిగారు. గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాలో సవిూకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పెద్దపల్లి జిల్లా అవుతుందని మనం కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి పెద్దపల్లిని జిల్లా చేసుకున్నాం. అద్భుతమైన కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని, ప్రజలందరినీ హృదయపూర్వంగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. పేదలు, రైతులు, ప్రజలు, మహిళలు గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా.. అద్భుతమైన పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతం గురించి విూకు తెలుసు. సింగరేణిలో వేల మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు దొరకుతున్నాయి. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సింగరేణి కార్మికులకు బోనస్‌ ఇస్తున్నాం. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్‌ చేసుకున్నాం. ఏ విధమైన కార్యక్రమాలు అమలవుతున్నాయో విూకు తెలుసు అని కేసీఆర్‌ తెలిపారు. నిన్న గాక మొన్న 26 రాష్టాల్రనుంచి దాదాపు 100 మంది రైతు నాయకులు వచ్చారని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను చూశాం. రైతులతో మాట్లాడం. ఈ రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు మా దగ్గర అమలు కావడం లేదు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని సభలో ఉన్న జనాలను కేసీఆర్‌ ప్రశ్నించారు. గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి దేశ ప్రజలను ఈ మోదీ దగా, మోసం చేశారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ధరలు పెంచారు. స్మశానాల విూద పన్ను, పాలవిూద జీఎస్టీ, చేనేత విూద జీఎస్టీ, పేద ప్రజలు ఉసురుపోసుకుంటూ.. లక్షల రూపాయాలు మేస్తూ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కొన్ని సన్నివేశాలు స్వయంగా చూస్తున్నాం. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేశామని చెప్తారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కల్తీ మద్యానికి 79 మంది బలయ్యారు. అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీని విూ సమాధానం ఏంటని అడుగుతున్నాను అని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు. రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపు నిచ్చారు. రైతులకు విూటర్‌ పెట్టాలని అంటున్న ఈ మోదీకే విూటర్‌ పెట్టాలన్నారు. రైతులకు మేలు చేస్తూ పేదలను ఆదుకుంటుంటే వాటిని ఉచితాలు అని బంద్‌ పెట్టాలని అంటున్నారు. ఉచిత కరెంట్‌ ఇస్తే విూటర్‌ పెట్టాలని అంటున్నారు. రేపు రాబోయే భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతుంది. ఈ గోల్‌ మాల్‌ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్దాల ఆడుతూ, దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. దేశంలోని మొత్తం వ్యవసాయానికి వాడే కరెంట్‌ కేవలం 20.8 శాతం మాత్రమే. దాని ఖరీదు ఒక లక్షా 45 వేల కోట్లు.ఓ కార్పొరేట్‌ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా మోదీ. రైతుల కోసం విూరు బయల్దేరండి అని ఆయా రాష్టాల్ర రైతులు నన్ను కోరారు. విూటర్‌ లేని రైతు రావాలని కోరారు. భారతదేశం స్వాగతం పలుకుతుందన్నారు. రైతులకు విూటర్‌ పెట్టాలని అంటున్న మోదీకి మనందరం కలిసి విూటర్‌ పెట్టాలి. ఆ పని చేస్తే మనకు పీడ వోతది. ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేదు. అనేక రంగాల్లో అవినీతి నెలకొని ఉందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌,ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపల్లి జిల్లాలో రూ. 48కోట్లతో నిర్మించిన సవిూకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. అనంతరం మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు.
చెప్పులు మోసే వెధవులుకూడా కారుకూతలు
బండి సంజయ్‌ విమర్శలపై సిఎం కెసిఆర్‌ ఘాటుగా స్పందించారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో కనబడుతున్నారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని అంటూ పరోక్షంగా బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. చెప్పులు మోసే వెధవలు కారు కూతలు కూస్తూ సామాజాన్ని కలుషితం చేస్తున్నారు. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెప్తున్నాం. పెద్దపల్లి చైతన్యం ఉన్న గడ్డ. సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి పిడికిలి ఎత్తాలి. అందరం కలిసి 2024లో బీజేపీ ముక్త్‌ భారత్‌ సృష్టించాలి. అందుకు సన్నద్ధపడాలి. ముందుకు కదలాలి. అప్పుడే ఈ దేశాన్ని కాపాడ గలుగుతాం. నిద్రాణమై ఉండకుండా మేల్కోని ప్రజలను చైతన్యం చేసి బీజేపీ, మతపిచ్చిగాళ్లు, ఉన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి ముందుకు పోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుజరాత్‌లో కూడా అమలు కావడం లేదు. అక్కడ దోపిడీ తప్ప మరొకటి లేదని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. అక్కడ్నుంచి వచ్చేటటువంటి గులామ్‌లు, దోపిడీ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢల్లీిలో తాకట్టుపెడుదామా దయచేసి ఆలోచించండి. 26 రాష్ట్రల రైతులు తమకు చెప్పారు. మా వడ్లు కొనరు అని చెప్పారు. ఢల్లీిలోనే నేనే స్వయంగా ధర్నా చేశాను. ధాన్యం కొనేందుకు మోదీకి చేత కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో నూకలకు, గోధుమలకు షార్టేజ్‌ వస్తుంది. పరిపాలన చేతగాక దేశ ఆర్థిక స్థితిని దిగజారుస్తున్నారు. మోసపోతే గోస పడుతాం. ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనక్కి పోతాం. కూలగొట్టడం చాల తేలిక.. కట్టడమే చాలా కష్టమని కేసీఆర్‌ చెప్పారు. ఇవాళ బాగు పడే సమయంలో గజదొంగలు. లంచగొండులు వచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటూ, మతం పేరు విూద కొట్లాడమని చెప్తున్నారు. నెత్తురు పారించమని చెప్పే పిశాచులు ప్రజలు మధ్య ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది. నేను చెప్పే మాటళల్లో సత్యం వుంది. కనుక చినుకులు పడుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.