భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు గవర్నర్‌ కావొచ్చు..

తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీలు కావొద్దా..?
` తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు
` రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
` ఆది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె వ్యతిరేకి
` గవర్నర్‌ తీరుపై మంత్రుల ఫైర్‌
హైదరాబాద్‌ (జనంసాక్షి):రాష్ట్ర  భాజపా అధ్యక్షురాలు గవర్నర్‌కావొచ్చు కాని తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీలు కావొద్దని అని మంత్రులు తమిళిసైపై మండిపడ్డారు. గవర్నర్‌ తమిళిసై తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కేబినెట్‌ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ ఎలా తిరస్కరిస్తారు? అని ప్రశ్నించారు. తమిళిసై ఆది నుంచి తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక బిల్లులు గవర్నర్‌ పెండిరగ్‌లో పెట్టారు. గవర్నర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని రాజ్యసభకు ఎలా నామినేట్‌ చేశారో గవర్నర్‌ చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 31వ తేదీన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్‌, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్‌ఎస్‌ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందంలో సభ్యుడిగా పనిచేశారు.  గవర్నర్‌ తమిళిసై  సౌందరరాజన్‌ చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్‌ కోటాలో  దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర కాబినెట్‌ చేసిన సిఫారసును గవర్నర్‌ తిరస్కరించడాన్ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తప్పుపట్టారు.  ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం క్యాబినెట్‌ లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫారసును గవర్నర్‌ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాజకీయ కక్ష్యసాధింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.  ప్రజా ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని సూచించారు. గతంలో ఏ గవర్నర్‌ ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి పట్ల ఇలా  వ్యవహరించడం సరికాదన్నారు.  రాజకీయ నేపథ్యం ఉన్న వారిని సేవా కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని గవర్నర్‌ ప్రశ్నిస్తున్నారని?  అంటే గవర్నర్‌కు రాజకీయ నేపథ్యం ఉండొచ్చు కానీ గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసే వ్యక్తికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉండొద్దా? అని ఆయన ప్రశ్నించారు.
తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే అర్హతలేదు
గవర్నర్‌ తమిళిసై రాజ్‌ భవన్‌ ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నదని వేముల ప్రశాంత్‌ రెడ్డిశాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ‘‘  గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌,కుర్రా సత్యనారాయణ పేర్లను  రాష్ట్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్‌ చేయడం అత్యంత దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబిసి)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్‌, షెడ్యుల్‌ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్‌ చేయడం యావత్‌ తెలంగాణ ఎంబీసి కులాలను,ఎస్టీ(ఎరుకల) సమాజాన్ని అగౌర పర్చినట్టే. రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమాన పరిచిన గవర్నర్‌ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ డైరెక్ట్‌ గా తెలంగాణ గవర్నర్‌ గా నియమించబడలేదా..?. తమిళ సై కి నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి.సర్కారియ కమిషన్‌ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లు గా నియమించాలని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పలు మార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్‌ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌ గా నియమించారు. ఇది పూర్తిగా సర్కారియా కమిషన్‌ సూచనలకు విరుద్ధం. రాజకీయాల నుండి నేరుగా గవర్నర్‌ అయిన తమిలి సై కి గవర్నర్‌ గా కొనసాగే నైతిక అర్హత లేదు. ఆమె నిర్ణయం అప్రజాస్వామికం. గవర్నర్‌ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా.’’అని అన్నారు.

తాజావార్తలు