భాజాపాలో అవినీతి చదలు
న్యూఢిలీ,జులై7(జనంసాక్షి):అవినీతి కుంభకోణాలతో దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తోంది. బిజెపి పనితీరు అయాచిత వరంగా మారుతోంది. అవినీతిలో కాంగ్రెస్‌ను మించిందని బిజెపి రుజువు చేసుకోవడంతో కాంగ్రెస్‌పై ఉన్న అవినీతి మచ్చకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఇంతకాలం కాంగ్రెస్ దశాబ్ద పాలనను విమర్శించిన మోడీయులకు ఇక కాంగ్రెస్‌కు పెద్దగా తేడా లేదని తేలిపోయింది. కాంగ్రెస్ కూడా ఈ అవకశాలను అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాకలు సిద్దం అవుతోంది. ఇప్పటికే రాహుల్ దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో లలిత్ మోడీ వ్యవహారం, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం కాంగ్రెస్‌కు కలసి వచ్చాయి. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికారపార్టీని ఉతికి ఆరేయడానికి కాంగ్రెస్ కార్యాచారణ సిద్దం చేసుకుంటోంది. అలాగే ఎపిలో ఓటుకు నోటు వ్యవహారం, తెలంగాణలో సిఎం కెసిఆర్ హావిూల అమలు తదితర అంశాలను కాంగ్రెస్ సొమ్ము చేసుకుంటోంది. ఓటుకు నోటు వ్యవహారంలో కూడా బిజెపి నోరు మెదకపోవడం ద్వారా టిడిపిని వెనకేసుకుని వచ్చింది. ఇవన్నీకూడా కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశాలుగానే చెప్పుకోవాలి. అందుకే కాంగ్రెస్ నేతలు మెల్లగా తమ గళాలు పెంచుతున్నారు. లలిత్ మోడీ వ్యవహారం చిన్నదేవిూ కాదు. ఈ విషయంలో సుష్మాస్వరాజ్, రాజ్‌స్థాన్ సిఎం వసుంధర రాజెలు అధికార దుర్వినియోగానికి పాల్పడినా వారిని బిజెపి వెనకేసుకుని వచ్చింది. ఈ వ్యవహారంలో ఇంతవరకు ప్రధాని మోడీ పెదవి విప్పలేదు. ఆయనెప్పుడూ దేశంలో ఉండరని అందుకే దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత చాకో ఎద్దేవా చేశారు. తాజాగా మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంపైనా కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రస్తుత సిఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ 2005 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వం నీతికి, నిజాయితీకి మారు పేరని చౌహాన్ చేసుకుంటున్న ప్రచారం మోసమని తేలిపోయింది. వ్యాపం కుంభకోణంలో గవర్నర్, ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలొచ్చినా బిజెపి అగ్ర నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మిన్నకుండిపోవడం హేయం. పలువురు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు నిందితుల జాబితాలోకెక్కినా మౌనమే సమాధానంగా వస్తోంది. ఆరోపణలెదుర్కొంటున్న ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర నేతలు పదవులను పట్టుకొని వేలాడటం అనైతికం కాక మరోటి కాదని మాజీ సిఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు. అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం వారిని బర్తరఫ్ చేయాలి. సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ సినిమాలను తలదన్నుతున్న వ్యాపం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపిలో ఆందోళనలు వస్తున్నా పట్టించుకోక పోవడంతో కాంగ్రెస్ దీనిని బాగా ఉపయోగించుకుటోంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందకు రాని పలు ప్రభుత్వ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటైన వృత్తి పరీక్షల మండలి వ్యాపంలో చోటు చేసుకున్న అక్రమాలు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన అక్రమాలను తలదన్నేలా ఉన్నాయని డిగ్గీరాజా అన్నారు. అక్రమార్కులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని మెడికల్, పిజి మెడికల్ కాలేజీల్లో వందలాది అనర్హులకు ప్రవేశాలు కల్పించారు. కానిస్టేబుల్, టీచర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, తదితర ప్రభుత్వ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఒకరి తరఫున మరొకరితో పరీక్షలు రాయించడం, పరీక్షా కేంద్రాల్లో సీటింగ్‌లో మార్పులు, ఒఎంఆర్ షీట్లు మార్చడం అక్రమాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. కనీస విద్యార్హతలు లేక పోయినా వేలాది మంది డబ్బులు పెట్టి ఉద్యోగాలు, మెడికల్ ప్రవేశాలు పొందడం ఆందోళన కలిగించే అంశం. వ్యాపం కుంభకోణంలో చేతులు మారింది రెండు వేల కోట్ల రూపాయలని కథనాలు వెలువడుతున్నా, వాస్తవ విలువ దానికి ఎన్నో రెట్లుంటుందని అది విస్తరించిన తీరునుబట్టి తెలుస్తుంది. వ్యాపం కుంభకోణంపై వార్తలు సేకరిస్తున్న ఒక టీవీ చానెల్ జర్నలిస్టు అక్షరుసింగ్ ఇటీవల అనుమానాస్పదంగా మరణించడంతో స్కాం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించడమే కాకుండాగ్భ్భ్రాంతి కలిగించింది. ఆయన అంతిమ సంస్కారాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కుంభకోణంతో పాటు బిజెపి నేతలు సుష్మా, వసుంధరల పాత్రలపై ఇప్పుడు విపక్ష కాంగ్రెస్‌కు ఆయుధాలు అందింవచ్చాయి. కుంభకోణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని వస్తున్న డిమాండ్లను 2014లో మధ్యప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ముగ్గురు సభ్యులతో విచారణ బృందాన్ని నియమించింది. మాజీ విద్యామంత్రి సహా ఇంతవరకు 100 మంది రాజకీయవేత్తలు అరెస్టయ్యారు. 3292 మంది పాల్పడిన నేరాలపై 92,176 పుటల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. ఇప్పటి వరకు 1900 మంది కారాగారం పాలయ్యారు. 500 మంది ఆచూకీ లేదు. 77 లక్షల మంది అభ్యర్థులు లంచాలు ఇచ్చారని ప్రతిపక్షం ఆరోపణ. డిటెక్టివ్ నవల మాదిరిగా కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలనీ, మధ్యప్రదేశ్ సీఎంను తక్షణం తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ- వ్యాపంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం తన తప్పేవిూ లేదని భావిస్తుంటే సీబీఐ విచారణను కోరాలని కాంగ్రెస్ ప్రతినిధి పి.సి.చాకో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికీ, ప్రధానికీ నైతిక బాధ్యత ఉందన్నారు. కుంభకోణానికీ, ట్రైనీ ఎస్సై మరణానికి సంబంధం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సూచించారు. ఇకపోతే ఎపిలోనూ కాంగ్రెస్‌కు ఆయుధం దొరికింది. ఇక్కడ ఓటుకునోటుతో కాంగ్రెస్ ఇప్పటికే పోరుబాట పట్టింది. ఓ వైపు ప్రత్యేక ¬దా కోరడం మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో బాబును నిలదీసే కార్యక్రమాలతో ముందుకు పోతోంది. తెలంగాణలో కెసిఆర్ హావిూలను అమలు చేయాలన్న డిమాండ్‌తో ముందుకు సాగుతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా తమకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి ఆధారంగా కాంగ్రెస్ పోరాటాలకు సిద్దం అవుతోంది.