భానుడి నిప్పుల వర్షం
ప్రచండ భానుడు నిప్పులు గక్కుతున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా యావత్ తెలంగాణ ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎండలకు తోడుగా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉక్కపోత, వడగాలులు ఆగం చేస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్నా కూడా సూర్యతాపాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం ఏడు గంటలైనా వాతావరణం చల్లబడడం లేదు. ఉపాధి కూలీలు, ఉద్యోగులు, పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు ఎండల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు హడిలిపోతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నేలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
సూర్యుడి దెబ్బకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చినెల పూర్తి కాకముందే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 36 డిగ్రీలు… ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో టెంపరేచర్ 37 డిగ్రీలు నమోదైంది. కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా… ఖమ్మంలో రికార్డయిన ఉష్ణోగ్రత 39 డిగ్రీలు.
మరో రెండు రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండలు పెరుగుతుండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అవసరముంటే తప్ప.. బయటకు రావద్దంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.