భారతీయ శక్తివంత మహిళలు వీళ్లే..

 

– చందా కొచ్చర్‌, ప్రియాంకాచోప్రాలకు చోటు

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఫోర్బ్స్‌ శక్తివంత మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చార్‌, రోషిని నాడర్‌ మల్హోత్రా, కిరణ్‌ మజుందార్‌ షా, ప్రియాంకా చోప్రాలు ఉన్నారు. తాజాగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను రిలీజ్‌ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చార్‌కు ఫోర్బ్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వుమెన్‌ లిస్టులో 32వ ర్యాంక్‌ దక్కింది. ఇటీవలే ప్రతిష్టాత్మక వుడ్‌రో విల్సన్‌ అవార్డును ఆమె గెలుసుకుంది. ఐసీఐసీఐ డిజిటల్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌ను స్టార్ట్‌ చేసింది.. దీనిద్వారా భారత్‌లోని సుమారు 17 రాష్టాల్ల్రో 11 వేల మంది గ్రామస్తులకు ఉపయోగం జరిగింది. ఈ ఏడాదిలోగా డిజిటల్‌ విలేజ్‌ను మరో 500 గ్రామాలకు విస్తరించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఈమె ఇన్సూరెన్స్‌ బిజినెస్‌కు ఐపీఓ ప్రకటించారు. బ్యాంక్‌ కొచ్చార్‌ సేవలను గుర్తించి.. ఆమె జీతాన్ని 63 శాతం పెంచింది. భారత్‌లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న ప్రైవేటు బ్యాంకు సీఈవోల్లో ఈమె నిలుస్తుంది.

—- రోషిని నడార్‌ మల్హోత్రాకు ఫోర్బ్స్‌ జాబితాలో 57వ ర్యాంక్‌ దక్కింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో సీఈవోగా ఉంది. 2009లో ఆ కంపెనీకి ఈమె సీఈవోగా మారింది. అప్పుడు ఆమె వయసు 27 ఏళ్లు మాత్రమే. ఓ ఏడాదిలోనే ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌గా మారారు. ఇప్పుడు ఆ కంపెనీ వాల్యూ 7.5 బిలియన్‌ డాలర్లు. ఆ కంపెనీ అన్ని నిర్ణయాలు ఈమే తీసుకుంటుంది. టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, ఇన్ఫోసిస్టమ్స్‌ను ఈ కంపెనీ చూసుకుంటుంది. ఆమె తండ్రి శివ నడార్‌ హెచ్‌సీఎల్‌ కంపెనీ ప్రారంభించారు.

శివ నడార్‌ ఫౌండేషన్‌కు రోషిని ట్రస్టీగా ఉన్నారు. ఆ సంస్థ ఎడ్యుకేషన్‌పై ఫోకస్‌ చేసింది. హెచ్‌సీఎల్‌ కంటే ముందు ఈమె న్యూస్‌ ప్రోడ్యూసర్‌గా పని చేసింది. కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది.

— కిరన్‌ మజుందార్‌ షా ఫోర్బ్స్‌ జాబితాలో 71వ ర్యాంక్‌లో నిలిచింది. ఈమె బయోకాన్‌ లిమిటెడ్‌ కంపెనీకి వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. కంపెనీ వాల్యూ ఇప్పుడు 2.3 బిలియన్ల డాలర్లు. భారత దేశ అత్యంత సంపన్న మహిళ మజుందార్‌. 1978లో బయోకాన్‌ బయోఫార్మా కంపెనీని ఈమె ప్రారంభించారు. అనేక జనరిక్‌ మందులను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. డయాబెటిస్‌, క్యాన్సర్‌ లాంటి రోగాలకు ఈ కంపెనీ మందులు తయారు చేస్తుంది. ఇన్సులిన్‌ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఆసియా కంపెనీ ఇదే కావడం విశేషం. మలేషియాలోని జోహార్‌ ప్రాంతంలో ఈ కంపెనీ ఓ ఫ్యాక్టరీ కూడా ఉన్నది.

— బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంకా ఇప్పుడు అక్కడ కూడా పాపులర్‌ స్టార్‌గా మారింది. ఫోర్బ్స్‌ లిస్టులో ఈమెకు 97వ ర్యాంక్‌ దక్కింది. ప్రియాంకా 2003లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుమారు 40 హిందీ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది బేవాచ్‌తోనూ హాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. ఏబీసీ ఛానల్‌కు సంబంధించిన క్వాంటికో టీవీ సిరీస్‌లోనూ నటిస్తున్న ప్రియాంకా అమెరికా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రియాంకా ఓ ప్రొడ్యూసర్‌గా కూడా మారింది. ఆమె పర్పుల్‌ పెబ్బల్‌ పిక్చర్స్‌ను ముంబైలో స్టార్ట్‌ చేసింది. ఇండియన్‌ ట్యాలెంట్‌ను వెలికితీయాలన్న ఉద్దేశంతో ఆమె పర్పుల్‌ పిక్చర్స్‌ను మొదలుపెట్టింది. యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ప్రియాంకా చిన్న పిల్లల హక్కుల కోసం కూడా పోరాడుతున్నది. ప్రియాంకా చోప్రా ఫౌండేషన్‌.. చిన్న పిల్లలకు స్కూలింగ్‌, మెడికల్‌ కేర్‌ కూడా అందిస్తున్నది.