భారత్‌కు ఎస్‌టీఏ-1 హోదా

– బలోపేతం కానున్న భారత రక్షణ రంగం
– దక్షిణాసియాలో హోదా దక్కించుకున్న ఏకైక దేశం భారత్‌
వాషింగ్టన్‌, జులై31(జ‌నం సాక్షి ) : భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తులను భారత్‌కు అమ్మే విషయంలో అమెరికా తన ఎగుమతి నియంత్రణలను సడలించింది. అలాగే భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య అధికార దేశం-1(ఎస్‌టీఏ-1) హోదాను ఇచ్చింది. ఈ ¬దాను దక్కించుకున్న ఏకైక దక్షిణాసియా దేశం భారత్‌ కావడం విశేషం.
అమెరికా-భారత్‌ మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలు ఈ హోదాతో మరింత బలోపేతం కానున్నాయని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. 2016లో భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను అమెరికా కల్పించింది. ఈ హోదాతో భారత్‌.. అమెరికా నుంచి ఆధునిక, సున్నితమైన టెక్నాలజీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇచ్చిన ఎస్‌టీఏ-1 హోదాతో భారత్‌కు యూఎస్‌ మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లైందని రోస్‌ తెలిపారు. ఎస్‌టీఏ-1 జాబితాలో ఉన్న 36 దేశాల్లో ఏకైక దక్షిణాసియా దేశం భారతే. ఈ జాబితాలో జపాన్‌, దక్షిణకొరియాలాంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ భారత్‌ పేరు ఎస్‌టీఏ-2 జాబితాలో మిగతా ఏడు దేశాలతో కలిపి ఉంది. అమెరికా వాణిజ్యశాఖ వివరాల ప్రకారం.. జీవ రసాయన ఆయుధాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తులు తదితరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎస్‌టీఏ-1 జాబితాలో ఉండే దేశాలకు అర్హత లభిస్తుంది.
—————————–