భారత్‌ను చూసి పాక్‌ నేర్చుకోవాలి

– పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌
దుబాయ్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకునేలా లేదనే సంగతి తెలిసిందే. ఆ జట్టు కాగితంపైనే బలంగా ఉందని, ఆటతీరు పేలవంగా ఉందని క్రికెట్‌ నిపుణులు విమర్శిస్తున్నారు. భారత్‌ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడటంతో పాక్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఓపెనర్లు, బౌలర్లు తమ ప్రణాళికలను ఎలా అమలు పర్చాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలని ఆర్థర్‌ హితవు పలికాడు. భారత క్రికెట్‌ వ్యవస్థ నుంచి పాకిస్థాన్‌ పాఠాలు నేర్చుకోవాలని వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో సెవిూస్‌ లాంటి మ్యాచ్‌కు ముందు మాలిక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టు నిర్మాణ పక్రియ జరుగుతున్నప్పుడు సమయం పడుతుంది. భయపడటానికి, ఆటగాళ్లను మార్చడానికి ఇది సమయం కాదన్నారు. ఆటగాళ్లను పదే పదే మారిస్తే కొత్తవాళ్లకు కాస్త టైం కావాలని, ఓసారి భారత్‌ను చూడండి.. వారెలా ఆటగాళ్లను తయారు చేసుకున్నారో చూడండి అంటూ పేర్కొన్నారు. ప్రపంచంలో అదే అత్యుత్తమ జట్టు అని, కెప్టెన్‌, సెలెక్షన్‌ కమిటీ, మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసిన ఆటగాళ్లకు నమ్మకం కల్పించాలని మాలిక్‌ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్‌ ముగిశాక పీసీబీ చైర్మన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చి మాలో ఆత్మవిశ్వాసం కల్పించాడు. ఇలాంటివి జరుగుతాయి, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని సూచించాడని మాలిక్‌ చెప్పాడు. జట్టులో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందన్న ఆర్థర్‌ వ్యాఖ్యలతో మాలిక్‌ ఏకీభవించాడు.