భారత్‌పై అమెరికా ఆంక్షలు రద్దు..
– రష్యా నుంచి ఆయుధ సంపత్తి కొనుగోలుకు మార్గం సుగమం
వాషింగ్టన్, ఆగస్టు2(జనం సాక్షి) : యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 716బిలియన్ డాలర్ల విలువ చేసే రక్షణ వ్యయాల బిల్లును ఆమోదించింది. ఇందులోని చాలా ప్రొవిజన్స్ భారత్‌తో అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేవిగా ఉండడం గమనార్హం. 2016లో ఒబామా హయాంలో అమెరికా భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనూ భారత్‌కు అదే స్థాయిలో ప్రాధాన్యతను కొనసాగిస్తున్నారు. సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ జాన్ మెక్‌కైన్
ప్రవేశపెట్టిన రిపోర్ట్ ఆన్ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2019(ఎన్డీఏఏ-19) బిల్లును యూఎస్ కాంగ్రెస్ 87-10 ఓట్ల భారీ మద్దతుతో ఆమోదించింది. ఇక అధ్యక్షుడు ట్రంప్ దీనిపై సంతకం చేయాల్సి ఉంది. ఇది చట్ట రూపం దాల్చితే అమెరికా భారత్‌పై విధించే ఆంక్షలు తగ్గిపోనున్నాయి. దీంతో భారత్ రష్యా నుంచి ముఖ్యమైన సైనిక సంపత్తిని కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. అమెరికా జోక్యం తగ్గిపోనుండడంతో ఇక భారత్ రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు ముందుకెళ్లే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఆమోదించిన సంయుక్త కాన్ఫరెన్స్ రిపోర్ట్‌లో.. అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామి అయిన భారత్‌తో అమెరికా సత్సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని సెనేట్, హౌస్ పేర్కొన్నాయి. ఈ రెండింటి భాగస్వామ్యం వ్యూహాత్మకంగా, కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని… ఇరు దేశాల సైన్యాల మధ్య వ్యూహాత్మక సమన్వయం ఉండాలని తెలిపాయి. జపాన్, భారత్, ఆస్టేల్రియా, తదితర మిత్ర దేశాలతో అమెరికా పరస్పర సహకారం పెంపొందించుకోవాలని వెల్లడించాయి.
—————————