భారత్‌పై ఒత్తిడి.. తేలికేం కాదు: బంగ్లాదేశ్ చిన్నజట్టు కాదు, ఇదిగో..

హైదరాబాద్: ప్రపంచ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు మార్చి 19వ తేదీన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్వార్టర్‌కు అర్హత సాధించిన జట్లలో బంగ్లాదేశ్ ఒక్కటే చిన్న జట్టుగా భావిస్తున్నారు. అయితే, దాని రికార్డ్ ఏమాత్రం కొట్టిపారేయలేనిదిగా ఉంది. ఇప్పుడు కూడా అది పోరాడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ రికార్డ్ చూస్తే… చిన్న జట్టుగా భావిస్తున్నప్పటికీ… అది పెద్ద జట్లకు ధీటుగా రాణిస్తోంది. ఇటీవలి ఆ జట్టు గెలిచిన పలు టోర్నీలో ఇందుకు నిదర్శనం. బంగ్లాదేశ్ గాలివాటం గెలుపు సాధించడం లేదు. పోరాడి గెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుందనగానే… అది చిన్న జట్టేనని.. భారత్ గెలిచినట్లేనని భావించవద్దని ఆ జట్టు ఇటీవలి ప్రదర్శనను చూపించి చెబుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ జట్టు పైన 3-0తో సిరీస్ గెలిచింది. వెస్టిండీస్ పైన 3-2తో సిరీస్ గెలిచింది. అంతేకాదు, శ్రీలంకను వారి గడ్డ పైన వన్డే మ్యాచ్‌లో ఓడించింది. ఆసియ్ కప్‌లో.. ఉపఖండ జట్లకు షాకిచ్చి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో తృటిలో ఓడింది. పాక్ పైన నెగ్గి ఆసియా ఛాంపియన్ నెగ్గితే చరిత్ర సృష్టించి ఉండేది. భారత్‌పై ఒత్తిడి.. తేలికేం కాదు: బంగ్లాదేశ్ చిన్నజట్టు కాదు, మూడేళ్ల కిందట ఆసియ్ కప్‌లో సచిన్ తన వందో సెంచరీని చేశాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవలం అయిదు వికెట్లు కోల్పోయి భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించి.. సచిన్ వందో సెంచరీ ఆనందం భారతీయులకు మిగలకుండా చేసింది. ప్రపంచ కప్ లీగ్‌లోను స్ఫూర్తివంత విజయాలు సాధించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ పైన కంటే భారత్ పైనే ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ చిన్న జట్టని చాలామంది భావిస్తున్నారు. పటిష్టమైన భారత్ చేతిలో అది ఓడిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో బంగ్లాదేశ్ పైన ఒత్తిడి లేకపోగా.. భారత్ పైనే అధిక ఒత్తిడి ఉంటుందంటున్నారు. అంతేకాదు, 2007 ప్రపంచ కప్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ జట్టు షాకిచ్చింది.