భారత్‌లో ఐసిస్ మూలాలు
– కొలంబో దాడిలో ఉగ్రవాదులు భారత్‌లోనే శిక్షణ పొందారు
– శ్రీలంక లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేననాయకే
కొలంబో, మే4(జనంసాక్షి) : శ్రీలంకలో బాంబు పేలుళ్ల మూలాలు భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. భారత్‌లో ఐసిస్ మూలాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని కొలంబో ఆత్మాహుతి దాడులు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంక రాజధానిలో ఈస్టర్ సందర్భంగా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ నిమిత్తం భారత్‌లోని కేరళ, బెంగళూరు, కశ్మీర్‌కు వచ్చివెళ్లినట్లు శ్రీలంక లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేననాయకే వెల్లడించారు. బీబీసీ ప్రతినిధితో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.
కొలంబోలో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులకు భారత్‌లో సంబంధం గురించి శ్రీలంకకు చెందిన ఓ సీనియర్ సైనిక అధికారి మాట్లాడటం ఇదే తొలిసారి. కొలంబో దాడులకు ముందు వారు భారత్ వెళ్లారని, అక్కడ బెంగళూరు, కేరళ, కశ్మీర్‌లో కొంత కాలం ఉన్నట్లు మావద్ద సమాచారం ఉందని తెలిపారు. బహుశా వాళ్లు శిక్షణ కోసం వెళ్లి ఉండవచ్చునని, లేదా ఐసిస్ తరఫున ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు పెంచుకునే నిమిత్తం వెళ్లి ఉండవచ్చునని సేననాయకే తెలిపారు. తమిళనాడు, కేరళలో ఇటీవల సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. పలువురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం సేననాయకే వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే.. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. కేంద్ర ¬ంశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. శ్రీలంక ఇప్పటి వరకు
అలాంటి సమాచారాన్ని మాతో పంచుకోలేదని, ఆ దేశ సెక్యూరిటీ సంస్థలు మాత్రం ఈ విషయాన్ని బయటకు వెల్లడించాయని అన్నారు. వాస్తవానికి కొలంబోలో ఉగ్రదాడులకు ఆస్కారం ఉందని శ్రీలంక ప్రభుత్వాన్ని భారత్.. దాడులకు కొద్ది గంటల ముందే హెచ్చరించింది. తమ కస్టడీలో ఉన్న ఐసిస్ సానుభూతిపరుడు తెలిపిన వివరాల మేరకు ఎన్‌ఐఏ.. శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించింది. తాజాగా శ్రీలంక ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ సేననాయకే చేసిన వ్యాఖ్యలపై భారతీయ దర్యాప్తు సంస్థలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి.