భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం
` కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి.
` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశంలో మోడీ
దిల్లీ,జనవరి 17(జనంసాక్షి): భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ.. ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్’ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు తీసుకున్న పలు చర్యలను వివరించారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎంతో ఉత్సుకతతో ఉందన్నారు. ‘విూ వ్యాపారాలను, ఆలోచనలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు’ని తెలిపారు. 2014 నాటికి కేవలం వందల సంఖ్యలోనే ఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 60వేలకు దాటిందన్నారు. గత ఆరు నెలల్లోనే 10వేల స్టార్టప్‌లు ప్రపంచస్థాయి నైపుణ్యాలతో నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో 50లక్షలకు పైగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ‘‘కరోనా వల్ల ఆర్థిక, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిరది. కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి. ప్రపంచం మేలు కోసం అందరం కలిసికట్టుగా కృషిచేద్దాం. కొవిడ్ వేళ 80కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాం. ఏడాదిలో 160 కోట్ల టీకా డోసులు పంపణీ చేశాం. భారత్‌లో ప్రస్తుతం కొవిడ్ మూడో దశ కొనసాగుతోంది. కరోనా సమయంలోనూ సంస్కరణలు అమలు చేశాం. ప్రపంచానికి కూడా భారత్ ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తోంది. ప్రజాస్వామ్యంపై భారతీయులకు గట్టినమ్మకం ఉంది’’ అని మోదీ అన్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్‌లో ఉంది. కేవలం గత నెలలో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయి. మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. ‘వన్ ఎర్త్ `వన్ హెల్త్’ నినాదంతో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు నిలిచాయి. ప్రపంచ దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్ల సరఫరా జరిగింది. భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటోంది. భారతీయులకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంది. 21వ శతాబ్దికి సాధికారత కల్పించే సాంకేతికత భారత్ వద్ద ఉంది’’ అని ప్రధాని వివరించారు.