భారత్‌ అంటేనే బిజినెస్‌

– అంతర్జాతీయ వ్యాపారానికి భారత్‌లో అద్భుతమైన అవకాశాలున్నాయి
– వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాది
– దావోస్‌లో ప్రముఖ సీఈఓల సమావేశంలో ప్రధాని మోడీ
దావోస్‌, జనవరి23(జ‌నంసాక్షి) : భారత్‌ అంటేనే బిజినెస్‌ అని, అంతర్జాతీయ వ్యాపారానికి భారత్‌లో అద్భుతమైన అవకాశాలున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సుకు హాజరైన మోడీ అక్కడ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత అభివృద్ధి గురించి, వ్యాపార అవకాశాల గురించి వివరించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. భారత్‌లో వ్యాపారానికి అనుకూల వాతావరణం ఉంటుందని, అంతర్జాతీయ సకర్యాలు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ
కంపెనీలకు చెందిన 40మంది సీఈఓలు, భారత్‌కు చెందిన 20 మంది సీఈఓలు పాల్గొన్నారు. ఐదురోజులపాటు జరిగే దావోస్‌ సదస్సులో ప్రధాని ఒకరోజు మాత్రమే పాల్గొన్నారు. అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సమావేశం అనంతరం వివిధ దేశాధి నేతలతో ద్వైపాక్షిక చర్చలు చేస్తారు. 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో వివిధ వ్యాపారాలకున్న అవకాశాలను ఈ సదస్సులో మోదీ వివరించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, సురేశ్‌ ప్రభు, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులు దావోస్‌ వెళ్లారు.