భారత్‌ క్లియరెన్స్‌తోనే.. 

ఛోక్సీకి పౌరసత్వం ఇచ్చాం
– వెల్లడించిన ఆంటిగ్వా
న్యూఢిల్లీ, ఆగస్టు 3(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జరిగిన భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మెహుల్‌ ఛోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆంటిగ్వా పౌరసత్వం కూడా ఉంది. కాగా ఛోక్సీకి తమ దేశ పౌరసత్వం ఉండడంపై ఆంటిగ్వా స్పందించింది. గత ఏడాది ఛోక్సీకి తాము పౌరసత్వం ఇచ్చామని తెలిపింది. అప్పుడు భారత ప్రభుత్వం నుంచి అందిన పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పరిశీలించిన అనంతరమే పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపింది. ముంబయికి చెందిన విదేశీ వ్యవహారాల రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి వచ్చిన ధ్రువపత్రంలోనూ ఛోక్సీకి సంబంధించి ప్రతికూల అంశాలేవిూ లేవని ఆంటిగ్వా వెల్లడించింది. ఛోక్సీ దరఖాస్తుపై కఠినమైన నేపథ్య తనిఖీలు కూడా చేశామని తెలిపింది. ఏ సందర్భంలోనూ ఆయన ధరఖాస్తుపై అనుమానాస్పద సమాచారం లేదని పేర్కొంది. గత ఏడాది నవంబరులో ఛోక్సీ ఆంటిగ్వా పౌరసత్వం పొందారు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఛోక్సీ వ్యాపార విస్తరణ కోసం తాను ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు చెప్తున్నారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మామ మెహుల్‌ ఛోక్సీలు పీఎన్‌బీలో రూ.13,500కోట్ల మోసానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఛోక్సీ ఈ ఏడాది జనవరిలోనే భారత్‌ విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం నీరవ్‌ మోదీ కూడా విదేశాల్లోనే ఉన్నారు. పీఎన్‌బీ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. భారత్‌, ఆంటిగ్వాల మధ్య దోషుల అప్పగింతపై ఒప్పందం లేదు. కానీ ఛోక్సీని భారత్‌ను తీసుకెళ్లేందుకు ఆ దేశం వినతిని తాము గౌరవిస్తామని ఇటీవల ఆంటిగ్వా ప్రభుత్వం వెల్లడించింది.