భారత్‌ చేతికి పాక్‌ యుద్ధవిమానం గుట్టు..!

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : భారత్‌-జపాన్‌లు నిన్న యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. ఇవి ఏటా జరిగే సాధారణ విన్యాసాల వంటివి కాదు. దీని వెనుక పాకిస్థాన్‌ వెన్నువిరిచే ఓ వ్యూహానికి భారత్‌ పదునుపెడుతోంది. ఇప్పటి వరకు భారత్‌పై ఆధిపత్యం సాధించానన్న పాక్‌ ఆనందం ఈ దెబ్బతో ఆవిరికానుంది. సాధారణంగా సముద్రతీరాల్లో జరిగే యుద్ధాల్లో సబ్‌మెరైన్లు అత్యంత కీలక

పాత్రపోషిస్తాయి. ఇవి రహస్యంగా శత్రువుల నావికాదళాన్ని ధ్వంసం చేస్తాయి. ఈ నేపథ్యంలో భారత్‌ అత్యుత్తమ స్థాయి సబ్‌మెరైన్లను సమకూర్చుకుంది. భారత్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని భావించిన పాకిస్థాన్‌ 1996లో అమెరికాలో లాక్‌హీడ్‌ మార్టీన్‌ నుంచి పి-3సీ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానంలో సబ్‌మెరైన్ల కదలికలను గుర్తించే వ్యవస్థ ఉంది. 1996 తర్వాత పాక్‌ ఈ విమానాలను క్రమం తప్పకుండా అప్‌గ్రేడ్‌ చేయించింది. ఇదిలా ఉంటే పీ-3సీలోని వ్యవస్థల పనితీరు తెలుసుకుని దానికి తగినట్లు సబ్‌మెరైన్ల సంచారాన్ని మార్చుకొనేలా భారత నావికాదళం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా జపాన్‌తో కలిసి సంయుక్త యుద్ధవిన్యాసాలు చేయాలని భారత్‌ సంకల్పించింది. జపాన్‌ కూడా పి-3సీ నిఘా విమానాలను వినియోగిస్తోంది. యుద్ధ విన్యాసాల సందర్భంగా ఆ విమానాలను భారత సిబ్బంది కూడా వినియోగిస్తారు. దీంతో పి-3సీపై భారత సిబ్బందికి పట్టువస్తుంది. ఫలితంగా పాక్‌ వద్ద ఉన్న ఈ రకం విమానాలకు అందకుండా మన సబ్‌మెరైన్లను అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే పి-3సీ నిఘా విమానాలు గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంసాపై ల్యాండ్‌ అయ్యాయి. భారత్‌ తరపున పీ-8ఐ నిఘా విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.