భారత్..తెరిచిన పుస్తకం
జర్మనీలో ప్రధాని మన్మోహన్‌సింగ్
నిర్భయ ఉదంతం, చట్టం ప్రస్తావన
భారత్‌కు సహకరిస్తామన్న ఏంజెలా మెర్కెల్
బెర్లిన్; భారతదేశం ‘తెరిచిన పుస్తకం’,తెరిచిన సమాజం’అని , ఇక్కడి ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో పరిఢవిల్లు తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన.. గురువారం నాడు అక్కడి ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో స్వాతంత్య్రం, మానవ హక్కులు గానీ, మానవ హక్కులకు గానీ భంగం కలిగితే వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ సామూహిక హత్యాచార సంఘటనను ప్రసావించారు. ఆ సంఘటన జరగ్గానే పౌరసమాజం తీవ్రంగా స్పందించిందని, దానితో అలాంటి ఘోర సంఘటనను నివారించడానికి పటిష్ఠమైన చట్టం చేశామని చెప్పారు.
తమ మధ్య సహకారం వృద్ధి చెందడంతో.. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం నుంచి ఆధునిక దేశం గా మారేందుకు తాము పూర్తి స్థాయిలో సహాయం చేస్తామని ఏంజెలా మెర్కెల్ చెప్పారు. అంతకు ముందు మెర్కెల్, మన్మోహన్ సింగ్‌ల సంయుక్తాధ్వర్యంలో రెండో విడుత అంతర ప్రభుత్వాల చర్చలు జరిగాయి. న్యూక్లియర్ సప్లియర్స్ గ్రూప్, వాసెనార్ ఎరేంట్‌మెంట్ , ఆస్ట్రేలియా గ్రూప్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్.. ఈ నాలుగు ఎగుమతి నియంత్రణ సంస్థల్లోనూ భారత్ పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించేదుకు జర్మనీ మద్దతు పలికింది.
శాంతి యుత అవసరాల కోసం అణు ప్రయోగాన్ని ఉపయోగించుకోవడానికి ఇరాన్‌కు పూర్తి హక్కు ఉందని భారత్ స్పష్టం చేసింది.ఇరాన్ సమస్యకు దౌత్య పరమైన పరిష్కారం చూడాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ అభిప్రాయ పడ్డారు. మెర్కెల్ తో జరిగిన సమావేశంలో ఆయనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కీలక వాణిజ్య అంశాలతో పాటు వీరిద్దరూ ఉగ్రవాదం పై పోరు, అఫ్ఘానిస్తాన్, ఇరాన్ అణు కార్యక్రమం, సిరియా పరిస్థితుల్లాంటి వివిధ అశాలపై చర్చించారు.