భారత్‌, బంగ్లా సరిహద్దు వివాదం పరిష్కారం

5

ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు

శరవేగంగా భారత్‌ అభివృద్ధి- ప్రధాని మోదీ

ఢాకా,జూన్‌6(జనంసాక్షి): భారత్‌ , బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభించింది. ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. రెండురోజుల బంగ్లా పర్యటనకు భారత ప్రధాని మోడీ ఢాకా చేరుకున్నారు. విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా మోడీకి ఘనస్వాగతం పలికారు. రెండు రోజలు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్‌ చేరుకున్న ఆయనకు ఢాకా విమానశ్రయంలో ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఢాకాలోని సవార్‌లో జాతీయ యుద్ధవీరుల స్తూపాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్తూపం వద్ద మొక్కను నాటారు. ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ స్వాతంత్య్రం  కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న బగబంధు మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడి చారిత్రక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని రెండు రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు మరింత సులభమయ్యాయి. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ కోల్‌కతా-ఢాకా-అగర్తలా, ఢాకా-షిల్లాంగ్‌-గువహటి బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పాల్గొన్నారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మైత్రి బంధాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో రిలయన్స్‌, అదానీ సంస్థల పెట్టుబడులు

ఇదిలావుంటే అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ బంగ్లాదేశ్‌లోని విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు 3బిలియన్ల అమెరికా డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. రిలయన్స్‌ 3వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. అదానీ గ్రూప్‌ కూడా బంగ్లాదేశ్‌లో రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. మహేశ్‌కాళి ప్రాంతంలో 1600 మెగావాట్ల కోల్‌-ఫైర్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.