భారత్‌ – మయన్మార్‌ సరిహద్దులో భూకంపం

jwmibbuoఢిల్లీ : భారత్‌ – మయన్మార్‌ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8 గా నమోదయింది. మణిపూర్‌ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో భూ ప్రకంపనలు తీవ్రంగా సంభవించాయి. భూకంపం తెల్లవారుఝామున 4 గంటల 35 నిమిషాలకు సంభవించింది. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు పరిస్థితిని సమీక్షించారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం సీఎంలతో ప్రధాన మంత్రి మోడీ నేరుగా ఫోన్ చేసి సంభాషించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన వారికి..గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేరుకొనేందుకు పయనమయ్యారు.
భూకంప తీవ్రతకి ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కోల్‌కతాలో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఇంఫాల్‌కు 33 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూ కంప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఇంకా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే సిలిగురిలో బస చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భూకంపం సంభవించినట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు.