భారత్ మాపై 100శాతం సుంకాలు విధిస్తోంది
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, జూన్27(జనం సాక్షి) : భారత్, అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య యుద్ధానికి తెరలేచిన విషయం తెలిసిందే. భారత్ నుంచి దిగుమతి అయ్యే స్టీలు, ఉక్కు ఉత్పత్తులపై అమెరికా సుంకాలను పెంచింది. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే దాదాపు 30 వస్తువులపై సుంకాలను పెంచేసింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తమ ఉత్పత్తులపై భారత్ 100శాతం టారిఫ్‌లు విధిస్తోందని ఆరోపించారు. వచ్చే వారం భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విదేశీ ఉత్పత్తులపై సుంకాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్‌ను స్థానిక విూడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆ దేశాలు కూడా తమపై టారిఫ్‌లు విధిస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకున్నారు. ‘కొన్ని దేశాలు, ఉదాహరణకు భారత్.. అమెరికా ఉత్పత్తులపై 100శాతం వరకు టారిఫ్‌లను విధిస్తోంది. అందుకే మేం కూడా పెంచాల్సి వస్తోంది. ఈ సుంకాలను పూర్తిగా తొలగించాలని మేం కోరుకుంటున్నాం. జీ7 సదస్సులోనూ ఇదే విషయం గురించి చర్చించాం. అన్ని టారిఫ్‌లను ఎత్తివేద్దామని నేను చెప్పాను’ అని ట్రంప్ అన్నారు. అయితే అందుకు ఏ దేశమూ అంగీకరించట్లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘టారిఫ్‌లపై కొన్ని దేశాలు మాతో చర్చిస్తున్నాయి. చర్చలు జరపకపోతే మేం సుంకాలు విధిస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి.. మేం బ్యాంక్ లాంటి వాళ్లం. అయితే మా నుంచి అందరూ దోచుకుంటున్నారు. గతేడాది చైనాతో మేం 500 బిలియన్ డాలర్లు నష్టపోయాం. ఈయూతో 151 బిలియన్ డాలర్లు కోల్పోయాం. ఇకపై అలాంటివి జరగనివ్వం’ అని ట్రంప్ అన్నారు. మరికొద్ది రోజుల్లో భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్.. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్‌తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్.. భారత సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.