భారత్‌ వైపే వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ చూపు

– భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం

– ప్రస్తుతం దేశంలో ఆర్థిక ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉంది

– ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది

– ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ

– సదస్సులో పాల్గొన్న 23దేశాలకు చెందిన ఎంపీలు, మేయర్లు

న్యూఢిల్లీ, జనవరి9(జ‌నంసాక్షి ) : వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు భారత్‌ వైపున పాజిటివ్‌ దక్పథంతో చూస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రవాస భారతీయల సదస్సులో ఆయన మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో భారత సంతతి వ్యక్తులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 23దేశాలకు చెందిన ఎంపీలు, మేయర్లు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత ప్రగతి, అభివృద్ధి విధానాలను గురించి ప్రధాని వివరించారు. భారత్‌కు స్వాగతం.. 130 కోట్ల మంది భారతీయుల తరఫున విూకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. విూలో చాలా మంది చదువుకోడానికి విదేశాలకు వెళ్లొచ్చు. లేదా విూ కుటుంబం అక్కడ స్థిరపడటంతో విూరు అక్కడే పుట్టి ఉండొచ్చు. భౌతికంగా విూరు విదేశాల్లో ఉన్న విూ మనసులో మాత్రం విూరు భారతీయులేనన్న భావన ఉంటుంది. భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మోదీ అన్నారు. ప్రపంచ బ్యాంకు, మూడీస్‌, ఐఎంఎఫ్‌లు కూడా భారత్‌ ప్రగతిపథంలో పయనిస్తోందని చెప్పాయని గుర్తుచేశారు. దీనికి కారణం సంస్కరణలేనని.. మార్పు రావాలంటే సంస్కరణలు అవసరమని.. అదే మార్గదర్శక సూత్రమని మోదీ చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రజల ఆకాంక్షలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని.. వాటిని చేరుకోవాలంటే సంస్కరణలు ఆవశ్యకమని చెప్పారు. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతికత, రవాణా రంగంలో ప్రభుత్వం పెట్టుబడులను పెంచుతోందని తెలిపారు. మన ప్రధాన లక్ష్యం అవినీతిని రూపుమాపడమేనన్నారు.

సందర్భంగా విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం భారత పౌరుల కోసమేగాక.. విదేశాల్లో ఉన్న ఎన్నారైల కోసం కూడా సుష్మాజీ నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి ఆమె నుంచి సాయం క్షణాల్లో అందుతుందన్నారు. భారతీయులు ఎక్కడ ఉన్నా, పూర్వీకులు మాత్రం తమ అభివృద్ధిని చూసి సంతోషపడుతుంటారని ప్రధాని తెలిపారు. జీవిస్తున్న ప్రాంతంలో విూరు రాజకీయంగా ఎదిగిన తీరు ప్రశంసనీయమని, విూరంతా విధానాలను రూపొందిస్తున్నారని, దీని పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు మోదీ చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు తన ముందు ఓ మినీ ప్రపంచ పార్లమెంట్‌ కూర్చున్నట్లు ఉందని మోదీ అభివర్ణించారు. ఈ సమావేశాలకు కెనడా, బ్రిటన్‌, ఫిజి, కెన్యా, మారిషస్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక దేశాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. అమెరికా, మలేషియా, స్విట్జర్లాండ్‌, గుయానా, ట్రినిడాడ్‌లకు చెందిన మేయర్లు హాజరయ్యారు. పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్జిన్‌(పీఐఓ) సమావేశానికి ఈ సారి అమెరికాకు చెందిన ఎంపీలు పాల్గొనడం లేదు. ప్రతి ఏడాది జనవరి 9వ తేదీన ప్రవాసీ భారతీయ దివస్‌గా జరుపుకుంటారు.