భారత్ – సౌదీ కీలక ఒప్పందాలు
– ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం
దిల్లీ,ఏప్రిల్ 3(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా భారత్-సౌదీ అరేబియా దేశాల మధ్య పలు విషయాల్లో అవగాహనకు వచ్చి ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానంగా కార్మికులు,పెట్టుబడుల రంగంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. చేతివృత్తుల రంగంలో సహకారానికి, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారంపై నిఘావర్గాల సమాచార మార్పిడిపై ఒప్పందం కుదిరింది.మనీలాండరింగ్ వ్యవహారంలో నిఘావర్గాల సమాచార మార్పిడిపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇక విూదట ఇరు దేశాలు ఆయా విషయాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.
ప్రపంచానికే భారత్ ఆశాజ్యోతి : మోడీ
యావత్ ప్రపంచానికే ఇపుడు భారత్ ఓ ఆశాజ్యోతిలా నిలిచిందని భారత ప్రధాని మోడీ చెప్పారు. రియాద్‌లో ఏర్పాటు చేసిన భారతీయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య భారత్ పటిష్ట ఆర్థిక వ్యవస్థగా ఎదిగింన్నారు. ప్రపంచానికి భారత్ ఎంతో ఇవ్వగలదని, ముఖ్యంగా ఆధునిక నైపుణ్యం కలిగిన సుశిక్షితులైన మానవ వనరులను అందించగలదని ఆయన చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఇండియా ముందంజలో ఉందన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
భారత్‌లో మహిళలు, బాలికల అభివృద్ధికి సలహాలు ఇవ్వండి
రియాద్ : రియాద్‌లో పర్యటిస్తున్న మోదీ అక్కడ టీసీఎస్ ఐటీ సెంటర్‌ను సందర్శించారు. మహిళతో ఆయన ముచ్చటించారు. ఐటీ సెంటర్‌ను పూర్తిగా మహిళలు నిర్వహించడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. నరేంద్రమోదీ ఎఫ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అలాగే భారత్‌లో మహిళలు, బాలికల అభివృద్ధికి సలహా ఇవ్వాలని కోరారు.
భారత దేశం గురించి ఎప్పటికప్పుడు సమాచారం కావాలన్నా, తన పనితీరు, నిర్ణయాల సమాచారం, తనతో సెల్ఫీలు దిగినవారి వివరాలు కావాలంటే నరేంద్రమోదీ ఎఫ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, దాంట్లో ఎప్పటికప్పుడు ఆప్‌డేట్ సమాచారం ఉంటుందని అన్నారు. విూ సలహాలు, సూచనలు వినటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. అలాగే భారత దేశంలో మహిళలు, బాలికల అభివృద్ధికి ఏం చెయ్యాలో కూడా సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తానని మోదీ అన్నారు. ఇక మోదీని చూసేందుకు టీసీఎస్ ఉద్యోగులు ఎగబడ్డారు. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. మోదీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం దక్కింది.సౌదీ అరేబియా అత్యున్నత పౌరపురస్కారంతో భారత ప్రధానిని సత్కరించారు. ఈ మేరకు ఆ దేశ రాజు అబ్దుల్ అజీజ్ మోదీకి పురస్కారాన్ని అందజేసి గౌరవించారు.




