భారత్ పెట్రోల్ బంక్ లో డీజిల్ కల్తీ”
వాహన దారుల ఆందోళన..
డీజిల్ ట్యాంకు వాల్వ్ ద్వారా నీరు లోనికి వెళ్లింది : బంక్ యజమాని
చేర్యాల (జనంసాక్షి) జులై 28 : ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు వచ్చిన ఘటన చేర్యాల పట్టణంలో శుక్రవారం కలకలం రేపింది. పట్టణ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్ శ్రీనివాస ప్రిల్లింగ్ స్టేషన్ లో బాధితుడు జంగా ఆంజనేయులు ఉదయం రూ.3 వేల డీజిల్ వాటర్ క్యాన్ లో తీసుకెళ్లి ట్రాక్టర్ లో పోశాడు. దీంతో ఆ ట్రాక్టర్ స్టార్ట్ స్టార్ట్ కావడం లేదని ఆశ్చర్యపోయాడు. అనుమానంతో డీజిల్ ను చెక్ చేయగా అందులో సగానికి పైగా నీళ్లు ఉండడంతో వెంటనే బంక్ కు వెళ్లి సిబ్బందిని నిలదీయగా తమకు సంబంధం లేదంటూ దాటవేశారు. ఉదయం నుంచి చాలా మందికి డిజిల్ పోశామంటూ దురుసుగా మాట్లాడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో సిబ్బంది బంక్ కు తాళం వేసికుని పరారయ్యారు. అంతలోనే అదే పెట్రోల్ బంక్ లో డీజిల్ పోయించుకున్న వాహనదారుల వాహనాలు ఎక్కడికక్కడ రోడ్డు మీద ఆగిపోవడంతో వారంతా పెట్రోల్ బంక్ కు క్యూ కట్టారు. వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు. కల్తీ డీజిల్ వల్ల తమ వాహనాలు చెడిపోతాన్నాయంటూ వెంటనే బంక్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీజిల్ తనిఖీ కోసం శాంపిల్ కు పంపిస్తామని, రిపోర్ట్ వచ్చిన అనంతరం దర్యాప్తు చేపట్టి బంక్ పై, యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డీజిల్ ను కల్తీ చేయలేదు వర్షపు నీటి ఉట : బంకు యజమాని సురేందర్
డీజిల్ ట్యాంకు వాల్వ్ ద్వారా నీరు లోనికి వెళ్లిందని బంక్ యజమాని కాటం సురేందర్ తెలిపారు. తమ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందన్నారు. కావాలని డీజిల్ ను కల్తీ చేయలేదని తెలిపారు. చెడిపోయిన వాహనాలకు అయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు గుంతల్లో నిలిచి ఊటలాగా వస్తోందని వెల్లడించారు. డీజిల్ ట్యాంక్ లోకి వాల్స్ ద్వారా నీరు రాకుండా వెంటనే మరమ్మతు చేయిస్తానని తెలిపారు.