భారత ఆటగాడి హాఫ్ సెంచరీ
వెల్లింగ్టన్: గ్రూప్ బి లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, యూఏఈల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు రాణించాడు. టీమిండియా ఆడని మ్యాచ్‌లో భారత ఆటగాడు రాణించడం ఏంటనుకుంటున్నారా? అవును..భారత ఆటగాడు మెరిశాడు. అదీ యూఏఈ జట్టు తరపున. భారత్‌కు చెందిన స్వప్నిల్ పాటిల్ యూఏఈ తరపున ఆడుతూ నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. వంద బంతులెదుర్కొన్న పాటిల్ 5 ఫోర్ల సాయంతో అజేయంగా 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యూఏఈ జట్టులో మరొక భారత ఆటగాడు క్రిష్ణ చంద్రన్ కరాటే.
2006లో దుబాయి చేరుకున్న వికెట్ కీపర్ పాటిల్ అంతకుముందు భారత్‌లో దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున ఆడాడు. అజింక్యా రహానేకు ఆప్త మిత్రుడు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ కూడా పంచుకున్నాడు. మరొక ఆటగాడు ఆల్ రౌండర్ క్రిష్ణ చంద్రన్ కేరళలోని కొల్లెన్‌గోడే అనే ఓ కుగ్రామానికి చెందినవాడు. 2010లో దుబాయికి వెళ్ళాడు. కేరళ ఆటగాడు శ్రీశాంత్, స్టువర్ట్ బిన్నీలతో కలిసి ఇతను ఆడాడు.




