భారత నావికాదళంలోకి మరో సబ్ మెరైన్
ఐఎన్ ఎస్ వాగిర్ ను జాతికి అంకిత చేసిన భారత్
న్యూఢిల్లీ, నవంబర్13 (జనంసాక్షి) : భారత నావికా దళం శక్తి మరింత పెరిగింది. మరో సబ్ మెరైన్ నావికాదళం అమ్ముల పొదిలోకి చేరింది. ముంబైలోని డిఫెన్స్ షిప్ యార్డ్ లో తయారైన 5వ స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ ”ఐఎన్ ఎస్ వాగిర్’ జాతికి అంకితమైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారైన ఈ వరల్డ్ క్లాస్ జలాంతర్గామిని మజగాన్ డాక్ నుంచి అరేబియా సముద్రజలాల్లోకి గురువారం జలప్రవేశం చేశారు.ఫ్రాన్స్ కు చెందిన నావెల్ డిఫెన్స్, ఎనర్జీ సంస్థ డీసీఎన్‌ఎస్ లు దీన్ని కల్వరి క్లాస్ సబ్ మెరైన్ గా రూపొందించాయి. ‘వాగిర్’ను సముద్రజలాల్లోకి ప్రవేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ప్రారంభించారు. భారత నేవీకి లాంతర్గాముల అవసరం అధికంగా ఉండటంతో ఈ తరహా సబ్ మెరైన్ లను మరిన్ని తయారు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇండియన్ నేవీ, డిఫెన్స్‌పీఎస్యూలు ఎండీఎస్‌ఎల్ (మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్) నేతత్వంలో దీన్ని తయారు చేశారు.మొత్తం ఆరు కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లను తయారు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకూ ఐఎన్ ఎస్ కల్వరితో పాటు ఖాంతేరి, కరాంగ్, వేలా పేర్లున్న సబ్ మెరైన్ లను తయారు చేసి, జాతికి అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెస్టన్ర్ నావెల్ కమాండ్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఆర్బీ పండిట్, మరో ఏడాదిలోగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావచ్చని, చివరి సబ్ మెరైన్ తయారీ అతి త్వరలోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఇక ఈ సబ్ మెరైన్ల నుంచి గాల్లోకి కూడా మిసైల్స్ పంపే అవకాశాలు ఉండటం గమనార్హం. సముద్ర జలాల్లో యుద్ధం చేయాల్సి వస్తే, వీటి వినియోగం కీలకం కానుంది.