భారత పన్ను రేట్లపై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా (USA) పాలనా పగ్గాల కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌మరోసారి భారత్ ‘సుంకాల’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ఆరోపించిన ఆయన.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే దిల్లీపై ప్రతీకార పన్నులు విధిస్తానని బెదిరింపులకు దిగారు.
2019లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌ను ఆయన ‘టారిఫ్ కింగ్ (Tariff King)’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌కు జీఎస్‌పీ (GSP)ని రద్దు చేశారు. ఈ హోదా వల్ల భారత మార్కెట్లలోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని ఆయన ఆరోపించారు. జీఎస్‌పీ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్) కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకం రహిత ఎగుమతులు చేయడానికి వీలుంటుంది.తాజాగా ఈ సుంకాల అంశాన్ని మరోసారి ప్రస్తావించిన ట్రంప్.. భారత పన్ను రేట్లపై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”హార్లే-డేవిడ్‌సన్ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తోంది. అక్కడ 100శాతం, 150శాతం, 200శాతం పన్నులు ఉన్నాయి. ఇలా అయితే మన కంపెనీలు భారత్‌తో ఎలా వ్యాపారం చేయగలవు?మనం వారి దేశానికి వెళ్లి అక్కడే ప్లాంట్‌ను నిర్మిస్తే.. మనకు టారిఫ్‌లు ఉండవు. అలా చేయాలనే భారత్ కోరుకుంటోంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
”మన ఉత్పత్తులకు భారత్ 200శాతం పన్నులు వసూలు చేస్తుంటే మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా? అది సరికాదు. మనం పన్నులు కడితే.. వారి నుంచి కూడా వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే.. భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నును విధిస్తాను” అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హయాంలో భారత్‌కు రద్దయిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్‌స్ (జీఎస్‌పీ) హోదాను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ట్రంప్.. ప్రైమరీ డిబేట్లకు తాను హాజరుకాబోనని వెల్లడించారు. ఈ బుధవారం జరిగే రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్‌లో తాను పాల్గొనట్లేదని తెలిపారు. భవిష్యత్తులో జరిగే డిబేట్లకు కూడా రాబోనని చెప్పారు. ”నేనెవరో.. ఎంత విజయవంతంగా అధ్యక్ష పదవిని నిర్వర్తించానో ప్రజలందరికీ తెలుసు. అందువల్ల నేను చర్చలు చేపట్టాల్సిన అవసరం లేదు” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. సాధారణంగా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసే నేతల మధ్య దశల వారీగా బహిరంగ డిబేట్‌లు జరుగుతుంటాయి.