భారత పర్యటనకు రానున్న..
కొరియా అధ్యక్షుడు
– జులై 8నుండి 11వరకు కొనసాగనున్న పర్యటన
సియోల్, జులై2(జనం సాక్షి ): దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ భారత పర్యటనకు రానున్నారు. జులై 8 నుంచి 11వ తేదీ వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పర్యటనలో భాగంగా మూన్ జే ఇన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఆర్థిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు మూన్ జే ఇన్ భారత సందర్శనకు వస్తున్నారని, ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారని ప్రకటనలో తెలిపారు. భారత్ దక్షిణ కొరియాకు కీలక భాగస్వామిగా మారుతోందని అక్కడి అధ్యక్ష నివాసం బ్లూ హౌస్ వెల్లడించింది. ఆర్థిక వ్యవహారాల్లోనే కాకుండా కొరియా ద్వీపంలో శాంతి, సుసంపన్నత నెలకొల్పాలన్న భారత ఆలోచనలూ ఇందుకు కారణమని తెలిపింది. మూన్ జే ఇన్ భారత పర్యటన అనంతరం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. కొరియా ద్వీపంలో శాశ్వతంగా శాంతి నెలకొల్పడంపై , ఆసియా దేశాలతో పరస్పర సహాయ సహకారాల అంశంపై ఆయన అభిప్రాయాలు, విధానాల గురించి ప్రసంగించనున్నట్లు సమాచారం.