భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్‌ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్‌ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్‌ జంగ్‌ యి మన్‌ (చైనా)పై అలవోక విజయం సాధించింది.

కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. పురుషుల ఈవెంట్‌లో ప్రణయ్‌ 21–19, 21–16తో వాంగ్‌ జు వి (చైనీస్‌ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్‌ 14–21, 17–21తో లి షె ఫెంగ్‌ (చైనా) చేతిలో, కశ్యప్‌ 10–21, 15–21తో ఆరో సీడ్‌ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో సింధు… రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో, ప్రణయ్‌… జపాన్‌కు చెందిన సునెయామతో తలపడతారు.