భారీగా పెరిగిన బంగారం ధరలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి):ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి రూ.42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. 2015 కనిష్ఠానికి డాలర్‌ విలువ పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు కలిసొచ్చిందని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 0.31శాతం పెరగడంతో ఔన్సు 1,352.80డాలర్లు పలికింది. 2016 సెప్టెంబరు తర్వాత ఔన్సు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే.